Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు త‌ల‌సాని కీల‌క ఆదేశాలు

By:  Tupaki Desk   |   22 Jun 2022 9:30 AM GMT
ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు త‌ల‌సాని కీల‌క ఆదేశాలు
X
క‌నీస వేత‌నాలు పెంచాలంటూ సినీ కార్మికులు బుధ‌వారం మెరుపు స‌మ్మెకు దిగిన విష‌యం తెలిసిందే. ఫెడ‌రేష‌న్ త‌రుపున ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ కి వేత‌నాల పెంపుపై లేఖ‌లు స‌మ‌ర్పించినా స్పంద‌న లేద‌ని ఆరోపిస్తూ సినీ కార్మికులు ఆక‌స్మాత్తుగా స‌మ్మె సైర‌న్ మోగించారు. పాన్ ఇండియా వ్యాప్తంగా తెలుగు సినిమాలు భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతున్నా మా క‌నీస వేత‌నాల‌ని పెంచ‌డం లేద‌ని ఆరోపిస్తూ కార్మికులు స‌మ్మెకు దిగ‌డంతో ఎక్క‌డిక‌క్క‌డ షూటింగ్ లు నిలిచిపోయాయి.

దీనిపై తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ బుధ‌వారం ఆద‌ర్శ్ న‌గ‌ర్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్ లో మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. క‌రోనా నేప‌థ్యంలో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బ‌దుల‌కు గుర‌య్యార‌ని, సినిమాల చిత్రీక‌ర‌ణ‌లు లేక‌పోవ‌డంతో ఉపాధి ల‌భించ‌క ఆర్ధికంగా క‌ష్టాలు ప‌డుతున్నార‌న్నా తెలిపారు. ఈ నేప‌థ్యంలో త‌క్ష‌ణ‌మే కార్మిక సంఘాల‌తో ఫిలిం ఛాంబ‌ర్, ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ చ‌ర్చ‌లు జ‌రిపి త‌క్ష‌ణ‌మే స‌మ‌ప్య ప‌రిష్కారానికి చొర‌వ తీసుకోవాల‌న్నారు.

ఈ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకునే వ‌ర‌కు వేచి చూడొద్ద‌ని హిత‌వు ప‌లికారు. అంతే కాకుండా కార్మికుల స‌మ‌స్య రెండు మూడు రోజుల్లో ప‌రిష్కారం అవుతుంద‌ని ఆశిస్తున్నాన‌ని తెలిపారు. ఇదిలా వుంటే ఫెడ‌రేష‌న్ ప్రెసిడెంట్ వ‌ల్ల‌భ‌నేని అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత దుమారం రేపేవిగా వున్నాయి. రేప‌టి నుంచి పెరిగిన వేత‌నాల లెట‌ర్ ని కార్మికుల‌కు అప్ప‌గిస్తామ‌ని, ఆ వేత‌నాల ప్ర‌కార‌మే కార్మికులు ప‌నిచేస్తార‌ని స్ప‌ష్టం చేశారు.

ముప్పై శాతం వేత‌నాలు పెర‌గాల‌ని నిర్మాత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని, పోలీసుల‌తో కార్మికులు స‌హ‌క‌రించాల‌ని తెలిపారు. ఇక ప్ర‌తీ మూడేళ్ల‌కు ఒక‌సారి కార్మికుల వేత‌నాలు పెర‌గాల‌ని, అయితే ఇంత వ‌ర‌కు పెర‌గ‌లేద‌ని కార్మికుల సాక్షిగా వ‌ల్ల‌భ‌నేని అనిల్ స్ప‌ష్టం చేశారు.

ఈ విష‌యంలో నిర్మాతలు విజ్ఞ‌ప్తి చేయ‌డం వ‌ల్లే ఇంత కాలం వేచి చూశామ‌ని, గ‌త ఆరు నెల‌లుగా ఈ విష‌యంపై ఛాంబ‌ర్ తో చ‌ర్చిస్తున్నామ‌ని, అయితే మేము వేత‌నాల గురించి అడిగిన ప్ర‌తీసారి ఛాంబ‌ర్ వారు ఇత‌ర స‌మ‌స్య‌ల‌ని పైకి తీసుకొస్తున్నార‌ని అనిల్ మండి ప‌డ్డారు. ప్ర‌స్తుత ప‌రిస్థితికి ఇదే కార‌ణ‌మన్నారు.

ఇదిలా వుంటే ప్ర‌స్తుతం ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ప్రొడ్యూస‌ర్స్ ప్ర‌త్యేకంగా సామ‌వేశాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మావేశంలో కె.ఎల్‌. దామోద‌ర ప్ర‌సాద్‌, సీ. క‌ల్యాణ్‌, ఏ.ఎం. ర‌త్నం, మైత్రీ మూవీ మేక‌ర్స్ ర‌వి శంక‌ర్‌, సుప్రియ యార్ల‌గ‌డ్డ‌, జెమిని కిర‌ణ్‌, భ‌ర‌త్ చౌద‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ సి. క‌ల్యాణ్ కార్మికుల వేత‌నాలు పెంచ‌డంలో మాకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ నెల 6న ఫెడ‌రేష‌న్ వారు ఓ లెట‌ర్ పెట్టారు. దీనిపై నిర్మాత‌ల‌మంతా స‌మావేశ మ‌య్యాం. షూటింగ్ లు ఆప‌డానికి ఎవ‌ర‌మూ సిద్ధంగా లేము. చ‌ర్చ‌లు జ‌రిపాక వేత‌నాల‌పై నిర్ణ‌యం తీసుకుంటాం` అని సి. క‌ల్యాణ్ తెలిపారు.