Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ సినిమాలో 'మీర్జాపూర్' యాక్టర్..!

By:  Tupaki Desk   |   16 March 2022 11:44 AM GMT
పవన్ కళ్యాణ్ సినిమాలో మీర్జాపూర్ యాక్టర్..!
X
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ''భవదీయుడు భగత్ సింగ్''. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన అప్పుడెప్పుడో వచ్చింది. కానీ ఇంతవరకు పట్టాలెక్కలేదు. పవన్ ఇతర కమిట్మెంట్స్ మరియు కరోనా పాండమిక్ పరిస్థితుల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది.

అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రం ఈ గ్యాప్ లో మరో సినిమా చేసుకోవచ్చని పక్కకి వెళ్లకుండా.. పవన్ కళ్యాణ్ సినిమాపై దృష్టి పెట్టారు. హీరో ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. 'సినిమాలో టైమింగ్ ఎంత ముఖ్యమో.. సినిమాకు టైమింగ్ అంతే ముఖ్యమని నేను నమ్ముతా.. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు మీతో పంచుకుంటా' అంటూ ఆ మధ్య దర్శకుడు ట్వీట్ చేశారు.

ఈ క్రమంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు హరీష్ శంకర్. జూన్ నెలాఖర్లో ఈ మూవీని సెట్స్ మీదికి తీసుకెళ్లాలని చూస్తున్నట్లు వెల్లడించారు. పవన్‌ కళ్యాణ్ తో తన సినిమా లేట్ అవుతున్నప్పటికీ.. ఈ నిరీక్షణ వృథా కాలేదనే విధంగా సినిమా ఉంటుందని చెప్పారు.

ఇప్పటికే స్క్రిప్టు పూర్తయినప్పటికీ ఇంకా దానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నానని.. షూటింగ్ మొదలయ్యాక కూడా ఈ పని కొనసాగుతుందని హరీష్ శంకర్ అన్నారు. పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డేనే హీరోయిన్ అని ధృవీకరించిన హరీష్.. ఓ కీలక పాత్రకు ‘మీర్జాపూర్’ ఫేమ్ పంకజ్ త్రిపాఠిని సంప్రదిస్తున్నట్లు తెలిపారు.

విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు - వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్నారు. తెలుగులో ఇంతకుముందు మంచు విష్ణు హీరోగా నటించిన 'దూసుకెళ్తా' చిత్రంలో విలన్ గా కనిపించారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'మీర్జాపూర్' ఒరిజినల్ సిరీస్ తో బాగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలో ''భవదీయుడు భగత్ సింగ్'' సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి పంకజ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని తెలుస్తోంది.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే డీఎస్పీ ఓ పాట రికార్డ్ చేసారని.. ఇంకో ట్యూన్ కూడా ఓకే అయిందని హరీష్ శంకర్ తెలిపారు. 'భవదీయుడు..' అనేది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని.. పవన్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయని చెప్పారు.

'గబ్బర్ సింగ్' తరువాత పవన్ - హరీష్ - దేవిశ్రీ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపిస్తాడని టాక్. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. 'భవదీయుడు భగత్ సింగ్ - వెండితెరపై చెరగని సంతకం. ఈసారి ఇది కేవలం వినోదం మాత్రమే కాదు' అని మేకర్స్ పేర్కొన్నారు.

నిర్మాతలు నవీన్ ఎర్నేని - వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా.. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు రామ్-లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ మరియు చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇకపోతే 'భవదీయుడు..' కంటే ముందు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా పూర్తి చేసే అవకాశం ఉంది.