Begin typing your search above and press return to search.

'నీ సినిమాల్లో సీన్స్ కాపీ' అంటూ జక్కన్నని కడిగేసిన డైరెక్టర్

By:  Tupaki Desk   |   23 April 2020 3:30 PM GMT
నీ సినిమాల్లో సీన్స్ కాపీ అంటూ జక్కన్నని కడిగేసిన డైరెక్టర్
X
దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' చిత్రాలతో మన తెలుగు చిత్రాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకొనిపోయాడని చెప్పవచ్చు. భారత దేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు. ప్రతి సినిమాని ఒక కళాఖండంగా తీర్చిదిద్దడానికి ఎంత సమయమైనా తీసుకొని పర్ఫెక్ట్ గా వచ్చే వరకు కష్టపడుతూనే ఉంటాడు. అందుకే ఆయన్ని టాలీవుడ్ ప్రేక్షకులు 'జక్కన్న' అని పిలుచుకుంటారు. ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి హీరో కోరుకుంటాడు. కమెర్షియల్ సినిమాలను ప్రేక్షకులకు నచ్చేలా తీయడంలో రాజమౌళిని మించిన డైరెక్టర్ లేదంటే అతిశయోక్తి కాదు. ఆడియన్సు పల్స్ పట్టుకోవడంలో సక్సెస్ అయిన అతి కొద్దిమంది దర్శకులలో జక్కన్న ఒకడని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఈ మధ్య ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్కార్ అవార్డు విన్నింగ్ సినిమా 'పారాసైట్'పై జక్కన్న స్పందించారు. ఆ సినిమా తనకు చాలా బోరింగ్ గా అనిపించిందని రాజమౌళి షాకింగ్ కామెంట్లు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా మిశ్రమ స్పందన వచ్చింది. 2019 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రంగా కొరియన్ మూవీ 'పారాసైట్' ఆసార్క్‌ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణ కొరియాలో పేద - ధనవంతుల జీవనం మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతూ బాన్‌ జూన్‌ హో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫెస్టివల్స్‌ లో అవార్డును సాధించిన పారాసైట్.. ఉత్తమ విదేశీ చిత్రం - ఉత్తమ చిత్రం - ఉత్తమ దర్శకుడు - ఉత్తమ స్క్రీన్‌ ప్లే కేటగిరీల్లో నాలుగు ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు క్రిటిక్స్‌ ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ మధ్య ప్రముఖ ఆన్‌ లైన్‌ ఫ్లాట్‌ ఫాంలో పారసైట్ చిత్రాన్ని చూసిన రాజమౌళి మాత్రం సగం సినిమా చూసి మధ్యలోనే నిద్రపోయాడంట. ఈ విషయాన్ని రాజమౌళి ఆ సినిమా చాలా స్లో గా ఉండటంతో నిద్రొచ్చేసిందని నిజాయతీగా చెప్పేసాడు.

అయితే ఇప్పుడు తాజాగా 'మిఠాయి' అనే తీపిలేని సినిమాని అందించిన వర్థమాన డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ దీనిపై స్పందిస్తూ రాజమౌళిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ బహిరంగ లేక విడుదల చేశాడు. పారసైట్ చిత్రాన్ని అవమానించేలా రాజమౌళి కామెంట్స్ చేయడం మీ స్థాయికి మర్యాదగా లేదు అని అన్నారు. 'పారసైట్ ఒరిజినాలిటీ కలిగిన అద్భుతమైన క్రియేటివ్ వర్క్. ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. కానీ బాహుబలి గురించి ప్రపంచ ప్రఖ్యాత ఫిలిం మేకర్స్ మాట్లాడినట్లు నేనెక్కడా చూడలేదు. ఒరిజినాలిటీ గురించి మాట్లాడుకుంటే మీ సై చిత్రంలో ఒక సన్నివేశం మొత్తం కాపీ చేశారు. మరికొన్ని చిత్రాల్లో కూడా సన్నివేశాలు కాపీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి మీరు అద్భుతమైన పారసైట్ చిత్రం గురించి బ్యాడ్ కామెంట్స్ చేయడం తగదు' అంటూ రాజమౌళిపై ప్రశాంత్ కుమార్ బహిరంగ లేఖ ద్వారా విమర్శల వర్షం కురిపించారు. దీనిపై స్పందించిన నెటిజన్లు 'అసలు నువ్వు ఎన్ని సినిమాలు తీసావ్.. అప్పుడెప్పుడో సినీ ఇండస్ట్రీ పుట్టినప్పుడు వచ్చిన డైరెక్టర్ లా మాట్లాడుతున్నావ్.. నువ్వు తీసిన మిఠాయి కళాఖండం కాదంటూ' ప్రశాంత్ కుమార్ పై కామెంట్స్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. వాస్తవానికి ఆస్కార్ సాధించిన ఈ సినిమాపై చాలా మంది విమర్శించారు. కొంతమంది బెస్ట్ మూవీ అని కితాబిచ్చారు. మరికొంత మంది సినిమా ఓకే బట్ ఆస్కార్ రేంజ్ కాదని అప్పట్లోనే కామెంట్ చేసారు. నిజానికి రాజమౌళికి స్లో నేరేషన్ సినిమాలు నచ్చవని గతంలో కూడా చాలాసార్లు చెప్పాడు.