Begin typing your search above and press return to search.

'వాళ్లకు ఈగో.. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారు'

By:  Tupaki Desk   |   18 Feb 2022 12:30 PM GMT
వాళ్లకు ఈగో.. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారు
X
కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌ బాబు చాలా గ్యాప్ తర్వాత ప్రధాన పాత్రలో నటించిన ''సన్‌ ఆఫ్‌ ఇండియా'' చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హోమ్ బ్యానర్ లో మంచు విష్ణు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీలో చోటుచేసుకున్న వివాదాలపై మోహన్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తో సమావేశానికి తనకు కూడా ఆహ్వానం ఉందని.. అయితే కొందరు కావాలనే దానిని తనకు అందకుండా చేశారని విలక్షణ నటుడు అభిప్రాయపడ్డారు.

పిలిచినా పిలవకపోయినా తనకంటూ ఒక విలువ ఉందని.. తన పని తాను చేసుకుంటున్నానని అన్నారు. ఇండస్ట్రీ మొత్తం ఒకటే కుటుంబం అంటూనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారని మోహన్ బాబు సంచనల వ్యాఖ్యలు చేశారు.

సినిమా టికెట్ ధరల మీద మోహన్ బాబు మాట్లాడుతూ.. ''రెండు నెలల క్రితం టికెట్‌ రేట్ల గురించి ఏపీ ప్రభుత్వంతో మాట్లాడటానికి అందరం కలిసి వెళ్దామని బహిరంగ లేఖ రాసా. దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ బిజీగా ఉన్నారన్నారు.

ఎంత బిజీ అయినా సమస్యపై చర్చించడానికి సమయం కేటాయించాలి. కానీ ఎవరూ రాలేదు. ఎందుకంటే వాళ్లకు ఈగో. నిజం చెప్పాలంటే 'నేనే గొప్ప' అనే అహంకారం వల్లే అందరం కలవలేకపోతున్నాం. అందరూ ఒకతాటిపై రాకపోవడానికి ఇదే కారణం. గతంలో ఇలా ఉండేది కాదు. నటీనటులంతా ఒకే చోట కూర్చొని ఎన్నో విషయాలపై చర్చించుకునేవాళ్లం''

''సినిమా టికెట్ ధరల విషయమై ఇటీవల ఏపీ సీఎంని కలవడానికి కొందరు సినీ ప్రముఖులు వెళ్లారు. సీఎంవో నుంచి నాకూ ఆహ్వానం ఉంది. నన్ను కూడా చర్చలకు పిలవాలని వారికి ప్రభుత్వం చెప్పింది.

కానీ ఆ విషయాన్ని వాళ్లు నాకు చెప్పలేదు. నన్ను రమ్మనీ పిలవలేదు. వాళ్లు పిలిచినా పిలవకపోయినా.. నాకంటూ ఒక చరిత్ర, గౌరవం, విలువ ఉంది. నా పని నేను చేసుకుంటున్నాను. ఎదుటివాళ్లకు చేతనైనంత సాయం చేస్తున్నాను. నా గురించి ఎవరో ఏదో అనుకుంటే అది వాళ్ల కర్మ. ఎదుటి వాళ్ళ మాటల్ని పట్టించుకోను. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదని అందరూ తెలుసుకోవాలి'' అని అన్నారు.

టాలీవుడ్ లో భారీగా రెమ్యూనరేషన్స్ తీసుకునే వారిపై స్పందించమని కోరగా.. ''ఇతర ఆర్టిస్టుల గురించి.. వాళ్లు తీసుకుంటున్న పారితోషికాలపై నేను కామెంట్ చేయను. నా గురించి మాత్రమే నేను మాట్లాడతాను.

బయట రాజకీయాల మాదిరిగానే ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అంటూనే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారు. ఎవరికి వారే గ్రేట్ అనుకుంటున్నారు. నా దృష్టిలో ఎవరూ గొప్ప కాదు. మనం చేసే పనులన్నింటినీ పైన భగవంతుడు చూస్తుంటాడు" అని మంచు మోహన్ బాబు చెప్పుకొచ్చారు.