Begin typing your search above and press return to search.

మోహన్ బాబు ఫైర్ అయ్యాడు

By:  Tupaki Desk   |   22 March 2018 8:29 AM GMT
మోహన్ బాబు ఫైర్ అయ్యాడు
X
సమకాలీన రాజకీయాలపై తరచుగా అసహనం వ్యక్తం చేస్తుంటాడు సీనియర్ నటుడు మోహన్ బాబు. ఈ మధ్య ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో 95 శాతం రాజకీయ నాయకులు దోపిడీదారులే అని విమర్శించారాయన. తాజాగా ఆయన మరోసారి తన అసహనాన్ని చూపించారు. దేశంలో రోజు రోజుకూ కుంభకోణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఒక ట్వీట్ చేశారు.

‘‘మనిషికి ఉన్నది ఒకే ఒక పొట్ట.. దానికి కావాల్సింది రెండు పూటలా తిండి.. కానీ మీరు మీ బిడ్డలకు.. బిడ్డల బిడ్డలకు కావాల్సినంత దోచుకుని.. దేశంలో బ్యాంకులు చాలక స్విస్ బ్యాంకుల్లో దేశ సంపదని దాచి పెట్టుకుంటున్నారు. రేయ్.. ఎంత సంపాదించినా చివరకు మిగిలేది ఆరడుగుల నేల.. గుప్పెడు బూడిద’’ అని పేర్కొన్న మోహన్ బాబు.. ‘ఎంబీ డైలాగ్’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జోడించారు.

ఈ ట్వీట్ చూశాక మోహన్ బాబు అసహనం ఎవరి మీద అనే చర్చ మొదలైంది. ఈ ట్వీట్లో ఓవైపు రాజకీయ నాయకుల్ని.. మరోవైపు బ్యాంకులకు టోకరా వేసిన వ్యాపారవేత్తల్ని కలిపి విమర్శిస్తున్నట్లుగా ఉంది. విజయ్ మాల్యా.. నీరవ్ మోడీ లాంటి వాళ్లు వేల కోట్లకు బ్యాంకుల్ని ముంచి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా కనిష్క్ జువెలరీ యాజమాన్యం కూడా ఇలాగే చేసి విదేశాలకు వెళ్లిపోయింది. ఈ కుంభకోణం బయటపడ్డ నేపథ్యంలోనే మోహన్ బాబు స్పందించారు. ఈ కుంభకోణాలకు పాల్పడ్డ వారిది ఎంత తప్పో.. వారి విషయంలో ఉదాసీనంగా ఉంటున్న ప్రభుత్వానిది కూడా అంతే తప్పు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు ఇలా స్పందించినట్లున్నారు.