Begin typing your search above and press return to search.

రాజకీయాలకు ఒక పెద్ద నమస్కారం... జగన్ తో దూరం...దూరం... ?

By:  Tupaki Desk   |   13 Feb 2022 2:30 PM GMT
రాజకీయాలకు ఒక పెద్ద నమస్కారం... జగన్ తో దూరం...దూరం... ?
X
తెలుగు చలన చిత్ర సీమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు రాజకీయాలకు ఒక పెద్ద నమస్కారం పెట్టేసారు. తాను ఇక మీదట క్రియాశీల రాజకీయాల్లో ఉండను అని తేల్చేశారు. మోహన్ బాబు రాజ్యసభ మాజీ సభ్యుడు కూడా. ఆయనలో ఈ మధ్య దాకా రాజకీయ ఆకాంక్ష బలంగా ఉండేది.

అయితే ఆయన రాజకీయాలలో అనుకున్న విధంగా ముందుకు సాగలేకపోయారు. ఎన్టీయార్ ఆయన్ని మెచ్చి ఇచ్చిన రాజ్యసభ సీటు తప్పితే మరేమీ పొలిటికల్ కెరీర్ లో దక్కలేదు. అప్పట్లో 1995 ఎపిసోడ్ లో అన్న గారిని కాదని చంద్రబాబు వైపు వచ్చినా మరో సారి ఆ ఎంపీ సీటు సాధించలేకపోయారు.

ఇక 1999 ప్రాంతంలో మోహన్ బాబు టీడీపీకి దూరమై బీజేపీకి మద్దతు ప్రకటించారు. నాడు కేంద్రంలో వాజ్ పేయ్ ప్రభుత్వం ఆరేళ్ల పాటు అధికారంలో ఉన్నా మోహన్ బాబుకు ఏ పదవీ దక్కలేదు. ఆయన కూడా ఆశించలేదు అంటారు. ఇక చంద్రబాబుకు మిత్రుడుగా, బంధువుగా ఉన్న మోహన్ బాబు రాజకీయంగా మాత్రం విభేదిస్తూ వచ్చారు. అందుకే ఆయన 2019 ఎన్నికల్లో బాబుకు రాజకీయంగా బద్ధ శత్రువు అయిన జగన్ నాయకత్వంలోని వైసీపీలో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతుగా కృషి చేశారు.

ఇక మోహన్ బాబు వైసీపీలో రాజ్యసభ సీటు ఆశించారు అని అంటారు. 2020లో వైసీపీకి నలుగురు ఎంపీలను నామినేట్ చేసే చాన్స్ వచ్చింది. కానీ మోహన్ బాబుకు నాడు టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తి ఉందని అంటారు. మరి కొద్ది నెలలలో మరో నాలుగు రాజ్య సభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి.

అయితే వీటిలో ఒక దానికి ఇస్తారని ఎక్కడా మోహన్ బాబు పేరు మాత్రం ప్రచారం జరగలేదు. ఆ మధ్య చూస్తే చిరంజీవికి వైసీపీ రాజ్యసభ ఆఫర్ ఇచ్చింది అని ప్రచారం జరిగింది. ఇక తాజాగా సినీ నటుడు ఆలీకి రాజ్యసభ అంటూ మరో ప్రచారం జరిగింది.

ఈ నేపధ్యంలో మోహన్ బాబు కి రాజ్యసభ ఈసారి కూడా దక్కదా అన్న చర్చ అయితే ఉంది. మరి ఏమైందో ఏమో కానీ ముఖ్యమంత్రి జగన్ తో సినీ ప్రముఖుల చర్చలలో కూడా టాలీవుడ్ సీనియర్ నటుడిగా మోహన్ బాబు కనిపించలేదు. ఇవన్నీ చూస్తూంటే ఆయన జగన్ కి దూరం అయ్యారా లేక దూరం పెట్టారా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇపుడు తాజాగా మోహన్ బాబు తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అని సంచలన ప్రకటన చేశారు. తాను ప్రస్తుతం సినిమాలు, యూనివర్శిటీ పనులలో బిజీగా ఉన్నాను అని ఆయన అంటున్నారు. అందువల్ల తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాను అంటున్నారు.

మొత్తానికి మోహన్ బాబు హర్ట్ అయి ఈ నిర్ణయం తీసుకున్నారా లేక ఆయన చెబుతున్నట్లుగా ఇతర పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఇలా డెసిషన్ తీసుకున్నారా అన్నది తెలియలేదు. టోటల్ గా ఆలోచిస్తే జగన్ తో బంధుత్వం ఉన్నప్పటికీ మోహన్ బాబు ఎందుకో రాజకీయాలకే ఒక పెద్ద నమస్కారం అనేశారు అంటే బాగా ఆలోచించాల్సిందే.