Begin typing your search above and press return to search.

స్క్రీన్ ప్లే రాశా.. దర్శకత్వం చేయను

By:  Tupaki Desk   |   4 Feb 2018 5:30 PM GMT
స్క్రీన్ ప్లే రాశా.. దర్శకత్వం చేయను
X
సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం మోహన్ బాబుది. ఆయన నటుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించారు. నిర్మాతగానూ ఆయనకు గొప్ప రికార్డే ఉంది. మరి ఈ అనుభవంతో స్వీయ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశమేమైనా ఉందా అంటే మాత్రం ఛాన్సే లేదంటున్నారు మోహన్ బాబు. ఐతే తాను రచయితనని.. స్క్రీన్ ప్లే రాసిన అనుభవం కూడా ఉందని.. తన కొత్త సినిమా ‘గాయత్రి’కి సైతం తాను స్క్రీన్ ప్లే సమకూర్చినట్లు మోహన్ బాబు వెల్లడించడం విశేషం. గతంలో తాను ‘నేరస్థులు’ అనే సినిమాకు స్క్రీన్ ప్లే అందించానని.. స్వతహాగా రాయడం అలవాటని.. ఇప్పుడు ‘గాయత్రి’కి కూడా స్క్రీన్ ప్లే రాశానని వెల్లడించారు మోహన్ బాబు.

ఐతే తాను ఎప్పటికి దర్శకత్వం మాత్రం చేపట్టనని మోహన్ బాబు స్పష్టం చేశారు. ఇందుకు కారణం చెబుతూ.. ‘‘దర్శకత్వం చాలా ప్రమాదకరమైన పని. నేను కనుక దర్శకుడిగా మారితే రోజుకు ఒకడిని కొట్టేస్తా. సెట్లో ఎవ్వరూ చెప్పిన సమయానికి రారు. దాంతో నాకు కోపం వస్తుంది. రాఘవేంద్రరావు గారికి కోపం వస్తే కుర్చీ ఎత్తి విసిరేసేవాడు. మా గురువు దాసరి నారాయణరావు గారైతే సెట్లో భయంకరంగా తిట్టేవారు. కొట్టడానికి కూడా వెళ్లేవాళ్లు. కానీ నేనైతే కొట్టేస్తా. అందుకే నేను దర్శకత్వం చేయను అనేది’’ అని మోహన్ బాబు అన్నారు. ‘గాయత్రి’ తర్వాత తాను చయబోయే సినిమాల గురించి స్పందిస్తూ.. ఎప్పటికైనా ‘రావణ’ చేస్తానని అన్నారు మోహన్ బాబు. అలాగే మంచు విష్ణు హీరోగా ‘కన్నప్ప’ కూడా చేయాల్సి ఉందని.. ఇవి రెండూ భారీ సినిమాలని.. వీటిని జాగ్రత్తగా చేయాలని ఆయనన్నారు.