Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సీఎం కాదు.. అందుకే అవార్డివ్వలేదు

By:  Tupaki Desk   |   5 Jun 2016 7:08 AM GMT
ఎన్టీఆర్ సీఎం కాదు.. అందుకే అవార్డివ్వలేదు
X
మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడేస్తుంటాడు మోహన్ బాబు. వివాదాస్పదం అవుతందనిపించినా సరే.. తాను ఏమనుకుంటే ఆ మాట బయటికి చెప్పేస్తుంటాడు. మోహన్ బాబు కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించాయి. కొంత వివాదాస్పదం కూడా అయ్యాయి. సెన్సేషనల్ హిట్టవడమే కాక విమర్శకుల ప్రశంసలూ అందుకున్న ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాకు సంబంధించి ఏ విధమైన ప్రభుత్వ అవార్డులూ రాకపోవడం పట్ల ఆయన నిరాశ వ్యక్తం చేస్తూ.. ఆ సమయంలో ఎన్టీఆర్ సీఎంగా లేకపోవడం వల్లే ఆ పరిస్థితి వచ్చిందన్నాడు. ఆయనే సీఎంగా ఉండి ఉంటే ఆ సినిమాకు తప్పకుండా అవార్డులు వచ్చేవన్నాడు.

కథకు తగ్గట్లుగా ‘అసెంబ్లీ రౌడీ’ అనే పేరు పెట్టామని.. ఐతే దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని.. ఓ దశలో సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు కూడా ఎదురైతే.. ఎన్టీఆర్ అండగా నిలిచారని మోహన్ బాబు అన్నారు. అప్పటి అసెంబ్లీ స్పీకర్ ధర్మారావు సినిమా చూసి ప్రశంసించారని.. బ్యాన్ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారని ఆయన అన్నారు. అవార్డులు రాకపోవడం గురించి స్పందిస్తూ.. ‘‘సినిమా అనేది ప్రధానంగా డబ్బులు.. పేరుతో ముడిపడింది. మేం ఆశించేది కూడా వాటినే. అవార్డులు ఎవరు కోరుకుంటారు’’ అని మోహన్ బాబు అన్నారు. ఐతే 1991లో ‘అసెంబ్లీ రౌడీ’ విడుదలయ్యే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మోహన్ బాబు వ్యాఖ్యలు ఆ ప్రభుత్వానికే తగుల్తాయన్నమాట.