Begin typing your search above and press return to search.

దాసరి ఆస్తి పంపకాలపై శిష్యుడేమన్నాడంటే..

By:  Tupaki Desk   |   5 Jun 2017 9:55 AM GMT
దాసరి ఆస్తి పంపకాలపై శిష్యుడేమన్నాడంటే..
X
దర్శకరత్న దాసరి నారాయణరావు కుటుంబలో కొన్ని ఆస్తి గొడవలున్నట్లు ఆయన చనిపోయిన రోజే స్పష్టమైంది. దాసరి పెద్ద కోడలు సుశీల మీడియా ముందుకొచ్చి ఆస్తి పంపకాలపై మాట్లాడింది. ఈ నేపథ్యంలో దాసరి కుటుంబంలో విభేదాలు బయటపడకుండా ఆస్తి పంపకాలు చేయాల్సిన బాధ్యతను దాసరి ప్రియ శిష్యుడు.. ఆయనకు దత్త పుత్రుడిలా భావించే మోహన్ బాబు తీసుకోబోబోతున్నట్లుగా ముందే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై తాజాగా ఒక ఇంటర్య్యూలో మోహన్ బాబు స్పందించారు. తాను ఆ బాధ్యత తీసుకోబోతున్న మాట వాస్తవమే అన్నారు. కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని మోహన్ బాబు అన్నారు.

‘‘ఆస్తి పంపకాల గురించి ఇప్పుడు మాట్లాడితే తొందరపాటవుతుంది. సమస్యలు ఉన్నాయి. పరిష్కరించే బాధ్యత నాపై ఉంది. నాతో దాసరి పెద్ద కొడుకు ప్రభు, అల్లుడు రఘు మాట్లాడుతుంటారు. అంతా సాఫీగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. దాసరి గారి ఆర్థిక వ్యవహారాల గురించి నాకు తెలియదు. వ్యక్తిగతంగా చేసే వ్యాపారాల గురించి ఎప్పుడూ ఆయన నాతో చెప్పేవారు కాదు. నేనూ అడిగేవాడిని కాదు. ఆయనతో వ్యాపారపరంగా నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. ఇక కుటుంబంలో ఆస్తి పంపకాల విషయానికి వస్తే.. రెండోసారి గురువుగారు ఆస్పత్రిలో చేరి.. ఆపరేషన్‌ థియేటర్‌ కు వెళ్లే ముందు పిల్లలకు ఏమైనా సెటిల్‌ చేయాల్సినవి ఉంటే చెప్పండి అనడిగాను. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తిని చూపించారు. ఆ వ్యక్తి ఒకట్రెండు విషయాలు చెప్పారు. అన్ని విషయాలూ పరిశీలించి సెటిల్ చేయాలి. దాసరి కుటుంబ సభ్యులకు నాపై గౌరవం ఉంది. మొన్న ప్రభు ఫోన్‌ చేసి.. అంకుల్‌ ఈ ఇంటికి మీరు పెద్ద కొడుకు.. మీరు వచ్చి రెండు రోజులైంది. రండి అన్నాడు. వస్తానని చెప్పాను. వెళ్లకుండా ఎందుకు ఉంటాను? ఆయన లేకపోయినా ఆయన కుటుంబం మీద ప్రేమ ఉంటుంది’’ అని మోహన్ బాబు అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/