Begin typing your search above and press return to search.

దిలీప్ సభ్యత్వ గొడవ.. లాల్ స్పందించాడు

By:  Tupaki Desk   |   1 July 2018 11:50 AM GMT
దిలీప్ సభ్యత్వ గొడవ.. లాల్ స్పందించాడు
X
వివాదాస్పద మలయాళ నటుడు దిలీప్ ను మళ్లీ అసోసియేషన్‌ ఆఫ్‌ మళయాళం మావీ ఆర్టిస్ట్స్(అమ్మ)లోకి తీసుకోవడం.. అతడి సభ్యత్వాన్ని పునరుద్ధరించడంపై మల్లూవుడ్లో దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. దిలీప్ కు మళ్లీ సభ్యత్వం ఇవ్వడాన్ని నిరసిస్తూ కొందరు హీరోయిన్లు ‘అమ్మ’ నుంచి తప్పుకున్నారు. దిలీప్ సభ్యత్వాన్ని ఆమోదించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ లాల్ మీద విమర్శలు గుప్పించారు. లాల్ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన్ని తిట్టిపోస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఐతే ఈ విషయంపై మోహన్ లాల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దిలీప్ సభ్యత్వ పునరుద్ధరణ నిర్ణయం తన ఒక్కడిదే కాదని లాల్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం లండన్లో ఉన్న లాల్.. అక్కడి నుంచే ఈ వివాదంపై ఒక ప్రకటన విడుదల చేశారు.

‘అమ్మ’ మహిళా వ్యతిరేకి అన్న ఆరోపణలు సమంజసం కాదని.. సంఘంలో ఏకీకృత విధానాలే అమలవుతుంటాయని లాల్ చెప్పాడు. దిలీప్‌ పై వేటు ఎత్తివేత నిర్ణయం తానొక్కడినే తీసుకోలేదని.. సభ్యులంతా సమీక్షించి తీసుకున్న నిర్ణయం అదని.. దీనివెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్నది నిజం కాదని ఆయన స్పష్టంచేశాడు. గత ఏడాది హీరోయిన్ కిడ్నాప్ ఉదంతం బయటికి వచ్చినపుడు మోహన్‌ లాల్‌ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో ఆడపడుచులంతా తన అక్కచెల్లెళ్లతో సమానమని.. వారికి ద్రోహం జరిగితే చూస్తూ ఉపేక్షించబోనని వ్యాఖ్యానించాడు. ఈ కేసుకు సంబంధించి దిలీప్‌ అరెస్ట్‌ అయిన వెంటనే అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఆయనే స్వయంగా ప్రకటించాడు. అలాంటిది ఇప్పుడు దిలీప్ జైలు నుంచి బయటికొచ్చి ఆ కేసు పక్కకు వెళ్లిపోగానే నిషేధం ఎత్తివేయడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో లాల్ ఇలా స్పందించాడు.