Begin typing your search above and press return to search.

మన స్టార్లు మోహన్ లాల్ మాదిరి చేయరేందబ్బా?

By:  Tupaki Desk   |   26 April 2020 8:54 AM GMT
మన స్టార్లు మోహన్ లాల్ మాదిరి చేయరేందబ్బా?
X
కోట్లాది మంది అభిమానుల అభిమానాన్ని పొందే నటీనటులు.. తరచూ తాము చెప్పుకునే ప్రేక్షక దేవుళ్లకు ఏం చేస్తుంటారు? వారికి కష్టం వచ్చినప్పుడు తమను అంతలా అభిమానించే వారికి ఏమిస్తారు? అన్న విషయాన్ని కరోనా టైంలో చూస్తే.. ఇంతేనా? అన్న భావన కలుగక మానదు. విపత్తులు విరుచుకుపడిన వేళ.. తమ పెద్ద మనసును విరాళం రూపంలో అందజేయటం ద్వారా తమ బాధ్యత తీరినట్లుగా భావిస్తుంటారు సినీ ప్రముఖులు.. సెలబ్రిటీలు.

ఒక సినిమా చేయటానికి కోట్లాది రూపాయిల పారితోషికాన్ని తీసుకునే హీరోలు కోటి రూపాయిలు ఇచ్చేందుకు కిందామీదా పడుతుంటారు. విరాళం తర్వాత.. సమాజానికి పనికి వచ్చే పనులు ఎందుకు చేయరన్నది అస్సలే అర్థం కాదు. తమకున్న పలుకుబడి.. ప్రజల్లో ఉండే పరపతి నేపథ్యంలో కష్టాల్ని తీర్చేందుకు ఎందుకు వినియోగించన్నది అస్సలు అర్థం కాదు.

టాలీవుడ్ తారల్ని చూసినప్పుడు ఒక్క విషయం స్పష్టమవుతుంది. ప్రజలకు ఏదైనా అనుకోని కష్టమొస్తే.. వారికి విరాళాలు అందజేయటం ద్వారా తమ బాధ్యత తీరిందని భావిస్తారు. మన స్టార్ల మాదిరి అందరూ ఉండదు. కొందరు కొత్త తరహాగా ఆలోచిస్తారు. ఆ కోవకే చెందుతారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆయన తరఫున పని చేసే విశ్వశాంతి ఫౌండేషన్.. వినూత్న ఆలోచనలకు పెద్ద పీట వేయటం గమనార్హం.

కరోనా వేళ రోగల నుంచి వైద్యులకు.. ఆరోగ్య సిబ్బందికి ఇన్ఫెక్షన్ల ముప్పు పొంచి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇలాంటి వాటికి చెక్ చెప్పేలా అసిమోవ్ రోబోటిక్స్ అనే కేరళ స్టార్టప్ ఒక రోబోను తయారుచేసింది. దీనికి అవసరమైన ఖర్చును మోహన్ లాల్ కు చెందిన ఫౌండేషన్ భరించింది. ఈ రోబోతో కరోనా రోగులకు సేవలు అందించే వైద్యులకు సాయంగా నిలవటమే కాదు.. ప్రమాదకారి వైరస్ నుంచి కాపాడుతోంది. కష్టం వచ్చినప్పుడు నాులగు రూపాయిలు విరాళంగా ఇచ్చామా? తమ పని అయిపోయినట్లుగా చేతులు దులుపుకునే బదులు.. ఇలాంటి స్టార్టప్ లకు ప్రోత్సహాన్ని ఇవ్వటం ద్వారా ప్రజలకు సేవ చేయొచ్చుగా? ఇలాంటి ఐడియాలు టాలీవుడ్ తెర వేల్పులకు ఎందుకు రావో?