Begin typing your search above and press return to search.

అరుదైన రికార్డు సాధించిన `దృశ్యం`

By:  Tupaki Desk   |   15 Sep 2017 2:32 PM GMT
అరుదైన రికార్డు సాధించిన `దృశ్యం`
X
వినూత్న క‌థ‌ల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌ని `దృశ్యం` సినిమా నిరూపించింది. మోహ‌న్ లాల్ హీరోగా 2013లో వ‌చ్చిన ఈ చిత్రం మాలీవుడ్ లో స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. మ‌ల‌యాళంలో వ‌చ్చిన ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ రూ.50 కోట్లు కొల్ల‌గొట్టిన మొద‌టి సినిమాగా చరిత్ర పుట‌లకెక్కింది. అంతే కాకుండా చాలా స్క్రీన్ల‌లో 150 క‌న్నా ఎక్కువ రోజులు ఆడిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాను తెలుగు - త‌మిళ‌ - క‌న్న‌డ‌ - హిందీ భాష‌ల్లోకి కూడా రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మ‌రో ఘ‌న‌త ద‌క్కించుకుంది. ఈ సినిమా చైనీస్ లో రీమేక్ కాబోతోంది. ఈ ఘ‌న‌త సాధించిన తొలి భార‌తీయ సినిమా `దృశ్యం` కావ‌డం విశేషం.

రిలీజైన ప్ర‌తి భాష‌లోనూ ఈ చిత్రం భారీ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం `ధ‌ర్మ‌యుధ‌య‌` పేరుతో శ్రీలంక‌లో సింహ‌ళీ భాష‌లో కూడా రీమేక్ అయింది. శ్రీ‌లంక‌లో కూడా మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. ఈ చిత్ర‌ రీమేక్ హ‌క్కుల‌ను ఓ చైనా నిర్మాణ సంస్థ కొనుగోలు చేసిన‌ట్లు ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ తెలిపారు. ఈ విధంగా చైనా కంపెనీ రీమేక్ రైట్స్ కొనుక్కున్న మొట్ట మొద‌టి భార‌తీయ సినిమా ఇదేన‌ని జోసెఫ్ చెప్పారు. చైనీస్ భాష‌లో కూడా `దృశ్యం` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. జ‌ప‌నీస్ భాష‌లో వ‌చ్చిన `ద డివోష‌న్ ఆఫ్ స‌స్పెక్ట్ ఎక్స్‌` అనే న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్లు వార్తలు వ‌చ్చాయి. చైనాలో ఈ సినిమా రీమేక్ కానున్న నేప‌థ్యంలో, జ‌పాన్ లో కూడా రీమేక్ అయ్యే అవ‌కాశం ఉందేమో వేచి చూడాలి.