Begin typing your search above and press return to search.

మోషన్ పోస్టర్: 'అన్నీ మంచి శకునములే' అంటున్న నందినీ రెడ్డి - సంతోష్ శోభన్..!

By:  Tupaki Desk   |   5 July 2021 8:21 AM GMT
మోషన్ పోస్టర్: అన్నీ మంచి శకునములే అంటున్న నందినీ రెడ్డి - సంతోష్ శోభన్..!
X
'పేపర్ బాయ్' సినిమాతో హీరోగా పరిచయమైన సంతోష్ శోభన్.. ఇటీవల 'ఏక్ మినీ కథ' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలో యువ హీరో వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. తాజాగా ''అన్నీ మంచి శకునములే'' అనే టైటిల్ తో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. 'ఓ బేబీ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందినీ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ఏడాది ప్రారంభంలో 'జాతిరత్నాలు' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా “అన్నీ మంచి శకునములే” టైటిల్ ను ప్రకటిస్తూ చిత్ర బృందం మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

'అన్నీ మంచి శకునములే' టైటిల్ మాదిరిగా మోషన్ పోస్టర్ కూడా మనోహరంగా ఉంది. ఒక హిల్ స్టేషన్ ను చూపిస్తూ మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఈ పోస్టర్ ని చూపించారు. 'శ్రీ కృష్ణార్జున యుద్ధం' లోని క్లాసిక్ సాంగ్ నుండి తీసుకోబడిన ఈ టైటిల్ మోషన్ పోస్టర్ కు.. 'అన్నీ మంచి శకునములే' బీజీఎమ్ ను జత చేశారు. టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ తోనే ఇదొక ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థం అవుతోంది. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. స్వప్న సినిమా మరియు మిత్ర వింద మూవీస్ బ్యానర్లపై ప్రియాంక దత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జె.మేయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దావూద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయగా.. లక్ష్మి భూపాల డైలాగ్ రైటర్ గా పని చేస్తున్నారు. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉన్నారు. 'అన్నీ మంచి శకునములే' చిత్రంలో వెన్నెల కిషోర్ - రావు రమేష్ - నరేష్ - గౌతమి - రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సక్సెస్ లతో జోష్ మీదున్న డైరెక్టర్ నందినీ రెడ్డి - హీరో సంతోష్ శోభన్ - నిర్మాత ప్రియాంక దత్ కలిసి చేస్తున్న ఈ చిత్రం వారికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.