Begin typing your search above and press return to search.

ఛాన్సులు లేక ఇంటింటికి వెళ్లి సబ్బులు అమ్ముతున్న నాటి హీరోయిన్!

By:  Tupaki Desk   |   17 Jun 2022 3:30 PM GMT
ఛాన్సులు లేక ఇంటింటికి వెళ్లి సబ్బులు అమ్ముతున్న నాటి హీరోయిన్!
X
సినిమా ప్రపంచమంత మాయా లోకం మరొకటి ఉండదు. తళుకుబెళుకులతో ఆకట్టుకునే ఈ రంగుల ప్రపంచంలో వెలిగిపోయే దీపాలతో పోలిస్తే ఆరిపోయే దీపాలకు లెక్కే ఉండదు. ఒకప్పుడు సూపర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. తర్వాతి కాలంలో అవకాశాల్లేకుండా పోయిన ఒక నటి తాజాగా ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముకుంటున్న విషయం తెలిస్తే నోట మాట రాకుండా పోతుంది.

నిజమా? అని అవాక్కు అయ్యేలా చేస్తుంది. తాజాగా ఒక యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితం గురించి చెప్పి అందరిని షాకిచ్చింది నటి ఐశ్వర్య. సీనియర్ నటి లక్ష్మీ గారాల పట్టిగా సుపరిచితురాలైన ఆమె.. హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే.

వెండితెరను ఏలుతుందని భావించినా.. అవకాశాలు లేకుండా పోవటం.. బుల్లితెరలో అవకాశాలు రావటం తెలిసిందే. ఏమైందో కానీ.. ఆ తర్వాత ఆ అవకాశాలు కూడా రాకుండా పోయాయి. ప్రస్తుతం రోజువారీ జీవనం కోసం తాను సబ్బులు అమ్ముతున్నట్లుగా చెప్పి.. నోట మాట రాకుండా చేశారు.

సుమారు 200 సినిమాల్లో నటించిన ఆమె జీవితం ఒక మిస్టరీగా కనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. తర్వాతి కాలంలో చిన్న పాత్రలకు పరిమితమై.. ఇప్పుడు అవకాశాల్లేక సబ్బులు అమ్ముకునే వరకు వెళ్లిన దుస్థితి ఒక పట్టాన జీర్ణం కాదు.

ఇల్లు గడవటం కష్టంగా ఉండటంతో ఇంటింటికి వెళ్లి సబ్బులు అమ్ముతున్నట్లుగా ఆమె చెప్పారు. తనకిప్పుడు పని లేదని.. ఆదాయం కూడా లేకపోవటంతో ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉందన్న ఆమె.. ''ఏదో ఒక పని చేయాలి. అందుకే ఇంటింటికి వెళ్లి సబ్బులు అమ్ముతున్నా. మంచి జీతం ఇస్తే పాచి పని చేయటానికి కూడా సిద్ధం'' అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తనకిప్పుడు అప్పులు లేవన్న ఆమె.. ఇతర సమస్యలు కూడా లేవన్నారు.

''ఒక్కటే సమస్య. ఇప్పుడు నాకు సరైన పని లేదు. నా కాళ్ల మీద నిలబడి స్వశక్తితో బతుకుతున్నందుకు గర్వంగా ఉంది. నలుగురు పిల్లలతో కలిసి ఉంటున్నా.. యోగా అలవాటుతో ఒకపూట మాత్రమే తింటున్నా. నా ఆర్థిక స్థితి మారాలంటే నాకో మెగా టీవీ సీరియల్ కావాలి'' అని పేరకొన్నారు. తాను బతికింది సీరియల్స్ వల్లనేనని.. సినిమాల వల్ల కాదంటూ కన్నీరు పెట్టుకున్నారు. తనకు సినిమాలు అన్నం పెట్టలేదని.. బుల్లితెర మాత్రమే తనకు అన్నం పెట్టిందని కుండబద్ధలు కొట్టిన ఆమె తీరు ఇప్పుడు షాకింగ్ గా మారిందని చెప్పకతప్పదు.