Begin typing your search above and press return to search.

MAA బిల్డింగుకి 30 కోట్లు.. మోహ‌న్ బాబు పావ‌లా ఇస్తే చిరు ముప్పావ‌లా?

By:  Tupaki Desk   |   2 July 2021 10:32 AM GMT
MAA బిల్డింగుకి 30 కోట్లు.. మోహ‌న్ బాబు పావ‌లా ఇస్తే చిరు ముప్పావ‌లా?
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు రంజుగా సాగ‌నున్నాయి. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల మ‌ధ్య‌ వార్ ప‌తాక స్థాయికి చేరుకుంటోంది. ఇక్క‌డ వ‌ర్గ‌పోరాటం ఎప్ప‌టికీ అంతం కాద‌ని సంకేతాలందాయి. ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం.. మంచు విష్ణు- వీకే న‌రేష్ వ‌ర్గం.. అంటూ ఇరువురి న‌డుమా పోటీ నెల‌కొంది. అలాగే జీవిత‌- హేమ‌- సీవీఎల్ త‌దిత‌రులు మా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీప‌డుతుండ‌డం చూస్తుంటే ఈ ఎన్నిక‌లు ఎంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మో అర్థం చేసుకోవ‌చ్చు.

కేవ‌లం 950 మంది స‌భ్యుల కోసం జ‌రిగే ఈ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీలు త‌ల‌దూర్చ‌డం బ‌య‌ట‌ప‌డుతోంది. కులం మ‌తం ప్రాంతం వ‌ర్గం అంటూ చాలానే సీన్ క‌నిపిస్తోంది. అయినా గంట‌లో ముగిసే ఇంత చిన్న ఎలక్ష‌న్ కి ఇంత హంగు ఆర్భాటం దేనికి? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

నాగ‌బాబు- ముర‌ళి మోహ‌న్ -మోహ‌న్ బాబు స‌హా ఎంద‌రో దిగ్గ‌జాలు ఆరంభం మా అసోసియేష‌న్ అధ్య‌క్షులుగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత రాజేంద్ర ప్ర‌సాద్ - శివాజీరాజా- వీకే న‌రేష్ వీళ్లంతా అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టి రెండేళ్ల సీజ‌న్ చొప్పున పాలించారు. అయితే శివాజీ రాజా వ‌ర్సెస్ వీకే న‌రేష్ మ‌ధ్య వివాదాల నేప‌థ్యంలో `మా` ప‌రువు పోయేలా గొడ‌వ‌లు ర‌చ్చ‌కెక్క‌డం చాలామందికి న‌చ్చ‌లేదు. దీనిపై ఇండస్ట్రీలో భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఇక సెప్టెంబ‌ర్ లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారు? అన్న‌ది అటుంచితే.. మూవీ ఆర్టిస్టుల సంఘానికి సొంత బిల్డింగ్ ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌ని ఆర్టిస్టులు భావిస్తున్నారు. అన్ని అసోసియేష‌న్లు ఎవ‌రికి వారు సొంత భ‌వంతుల్ని నిర్మించుకుంటుంటే ప్రతిష్ఠాత్మ‌క మా అసోసియేష‌న్ కి క‌నీసం పునాది రాయి అయినా ప‌డ‌లేద‌న్న వెన‌క‌బాటుత‌నం వెక్కిరిస్తోంది. అందుకే దీనికి ప‌రిష్కారం క‌నుగొనేందుకు సినీపెద్ద‌లు బ‌రిలో దిగుతున్నార‌ట‌.

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు నేరుగా బ‌రిలో దిగారు. మా సొంత భ‌వంతి నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే నిధిని స‌మ‌కూర్చే ప్లాన్ ని సిద్ధం చేస్తున్నార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఆయ‌న మా భ‌వంతికి అవ‌స‌ర‌మ‌య్యే భూమి కోసం తెరాస ప్ర‌భుత్వాన్ని చిరంజీవి క‌లిసి మంత‌నాలు సాగిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. కేసీఆర్ - కేటీఆర్ బృందానికి చిరు స్వ‌యంగా ఈ విష‌యాన్ని నివేదిస్తారు. అయితే భ‌వంతి నిర్మాణం కోసం సినీపెద్ద‌లు నిధిని సేక‌రిస్తారు.

ఇప్ప‌టికే మంచు మోహ‌న్ బాబు `మా అసోసియేష‌న్ సొంత బిల్డింగ్ కోసం పావ‌లా వంతు బ‌డ్జెట్ ని తాను భ‌రిస్తాన‌ని ప్రామిస్ చేసారు. అలాగే మంచు విష్ణు సైతం నాన్న‌గారి స్ఫూర్తితో తాను ఈ సాయాన్ని ద‌గ్గ‌రుండి బాధ్య‌త‌గా చూస్తాన‌ని ఇంత‌కుముందు ప్ర‌క‌టించారు. ఇక మిగిలిన ముప్పావ‌లా వంతు నిధిని సమీక‌రించ‌డ‌మే ఇప్పుడు ఇంపార్టెంట్ గా మారింది. అంటే మా భ‌వంతిని 30 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తే అందులో ఎంబీ వాటా 8కోట్ల మేర ఉంటుంది. మిగ‌తా 22 కోట్ల‌ను మిగ‌తావాళ్లంతా స‌మీక‌రించాల్సి ఉంటుంది. అయితే ప‌రిశ్ర‌మ ఆప‌ద్భాంద‌వుడు చిరంజీవి ఆ పెండింగ్ మొత్తాన్ని త‌న బాధ్య‌త‌గా తీసుకుని సాయ‌మిస్తారా? లేక ఇండ‌స్ట్రీలో దాత‌ల నుంచి సాయం కోర‌తారా? అన్న‌ది కూడా ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల్లోకొస్తోంది.

ఏదేమైనా త‌మిళ‌నాడు- చెన్నైలోని న‌డిగ‌ర సంఘం భ‌వంతిని కొట్టేలా అంత‌కుమించేలా తెలుగు ఆర్టిస్టుల సంఘం భ‌వంతి నిర్మాణం సాగాల‌ని అంతా కోరుకుంటున్నారు. న‌డిగ‌ర సంఘం భ‌వంతి కోసం సుమారు 30 కోట్లు మించి ఖ‌ర్చు చేశార‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. అంత‌కుమించిన బ‌డ్జెట్ తో మా అసోసియేష‌న్ ప్రాంగ‌ణాన్ని సువిశాలంగా నిర్మిస్తార‌నే స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఇక కేసీఆర్ తో భేటీ అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి జ‌గ‌న్ ని క‌లిసి విశాఖ టాలీవుడ్ గురించి ముచ్చ‌టిస్తార‌ని గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి.