Begin typing your search above and press return to search.

ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి.. నరేష్ పై సినీ ప్రముఖులు ఫైర్..

By:  Tupaki Desk   |   11 Sep 2021 4:52 PM GMT
ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి.. నరేష్ పై సినీ ప్రముఖులు ఫైర్..
X
టాలీవుడ్ హీరో సాయి తేజ్ రోడ్డు శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తేజ్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి వైద్యానికి స్పందిస్తున్నారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురయ్యారని తెలిసి అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ క్రమంలో దీనిపై సీనియర్ నటుడు నరేష్ స్పందించిన తీరుపై పలువురు సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

తేజ్ రోడ్డు ప్రమాదంపై నరేష్ స్పందిస్తూ.. ''సాయి ధరమ్‌ తేజ్‌ నా బిడ్డలాంటివాడు. తను త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నా కుమారుడు - సాయి మంచి స్నేహితులు. అన్నదమ్ముల్లా ఉంటారు. నిన్న సాయంత్రం వాళ్లిద్దరూ ఇక్కడి నుంచే బయలుదేరారు. బైక్‌ పై స్పీడ్‌ గా వెళ్లొద్దని చెప్పాలనుకుని బయటకు వచ్చేసరికే.. వాళ్లు వెళ్లిపోయారు. నాలుగు రోజుల క్రితం కూడా వీళ్లిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇవ్వాలనుకున్నాను. కానీ కుదరలేదు. పెళ్లి కెరీర్‌ తో జీవితంలో సెటిల్‌ కావాల్సిన వయసు ఇది. ఇలాంటి సమయంలో ఈ విధమైన రిస్క్‌ లు తీసుకోకుండా ఉండటమే మంచిది. సాయి వేగంగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నాను'' అని అన్నారు. ఈ సందర్భంగా గతంలో ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తులను నరేష్ ప్రస్తావించడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి.

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ దీనిపై స్పందిస్తూ.. ''సాయి ధరమ్ తేజ్ గారు త్వరలోనే షూటింగ్ లు చేస్తారు.. బ్రహ్మాండంగా ఉంటారు. చిన్న ప్రమాదం జరిగింది. ఈ టైమ్ లో నరేష్ గారూ.. ఎవరెవరో ప్రమాదవశాత్తు మరణించిన వారి పేర్లు చెప్పడం గాని.. మీరు అలా మాట్లాడటం గాని కరెక్ట్ కాదు. రేసింగ్ చేశాడు.. అది చేసాడు.. ఇది చేశాడు.. మీ ఇంటి దగ్గరకి వచ్చాడని.. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు సార్? ఇలాంటప్పుడు ఆ పరమేశ్వరుడిని ప్రార్ధించి, త్వరగా కోలుకోవాలని హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి.. అవన్నీ ఇప్పుడు ఎందుకు?'' అని ఓ వీడియో ద్వారా తెలియజేశారు. నిర్మాత నట్టి కుమార్ కుమార్ కూడా నరేష్ పై భగ్గుమన్నారు.

ఇక సీనియర్ హీరో శ్రీకాంత్ ఓ వీడియో ద్వారా నరేష్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ''సాయి ధరమ్ తేజ్‌ కి జరిగింది చాలా చిన్న యాక్సిడెంట్. రోడ్డు మీద ఇసుక ఉండటం మూలంగా స్కిడ్ అయి పడిపోవడం జరిగింది. ఆయన త్వరగా కోలుకుంటారు. కోలుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అలాగే, దయచేసి ఎవరైనా వీడియో బైట్స్ పెట్టేముందు కొంచెం ఆలోచించి పెట్టండి. ఎందుకంటే నాకు తెలిసిన కుర్రాళ్లలో సాయి తేజ్ చాలా మెచ్యూర్డ్ పర్సన్. అతను ర్యాష్ డ్రైవింగ్ కానీ, ర్యాష్‌ గా వెళ్లే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి గురించి ఈ టైమ్‌ లో మనం బెట్టే బైట్స్ కుటుంబాన్ని మరింత టెన్షన్‌ కి గురి చేసినట్లవుతుంది. నరేష్‌ గారు పెట్టిన బైట్ కరెక్ట్ కాదనిపించింది. ఈ టైమ్‌ లో చనిపోయిన వారి గురించి ప్రస్తావించకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. దయచేసి ఇటువంటి బైట్స్ ఎవరూ పెట్టవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయితేజ్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను'' అని శ్రీకాంత్ అన్నారు.

తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో నరేష్ దీనిపై వివరణ ఇచ్చారు. ''నేను ఉదయమే సాయితేజ్‌ గురించి ప్రార్థించాను. చాలా ఫాస్ట్‌ గా రికవరీ అవుతున్నాడు. త్వరలో సాధారణ స్థితికి వస్తాడు. నేను వీడియోలో స్పష్టంగా చెప్పాను. వీళ్లిద్దరూ కలిసి బయలుదేరిన మాట వాస్తవం. ఇద్దరూ ఓ చాయ్‌ దుకాణం ఓపెనింగ్ కి వెళ్లారు. ఆ తర్వాత ఎవరికి వారు తిరిగి వచ్చేటప్పుడు రోడ్డుపై ఉన్న మట్టి కారణంగా జారి ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో 60-70 కిలోమీటర్ల స్పీడ్‌ లో ఉన్నట్టు సీసీ టీవీ ఫుటేజీ చూస్తే తెలుస్తోంది. ఇది నిర్లక్ష్యం కాదు.. కేవలం ప్రమాదం మాత్రమే. ప్రమాదాలు జరుగుతుంటాయి. బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం తప్ప మరో ఆలోచన లేదు. సాయి క్షేమంగా బయటపడినందుకు చాలా సంతోషంగా ఉంది. తర్వగా కోలుకోవాలని కోరుకుంటున్నాను'' అని నరేశ్‌ అన్నారు.

''సాయి తేజ యాక్సిడెంట్ పై నేను కాంట్రవర్సీ చేయడం లేదు.. రాజకీయం అసలు మాట్లాడటం లేదు. చిరంజీవి మేము మద్రాస్ లో కలిసే ఉన్నాం. మా రెండు కుటుంబాల మధ్య చాలా ఆత్మీయ బంధం ఉంది. సాయి కోలుకుని ఇంటికి వచ్చాక వెళ్లి కలుస్తాను. చిరంజీవి - నాగబాబుతో కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాను'' అని నరేష్ తెలియచేశారు.