Begin typing your search above and press return to search.

రేపు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో సినీ ప్రముఖుల భేటీ...

By:  Tupaki Desk   |   27 Dec 2021 10:49 AM GMT
రేపు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో సినీ ప్రముఖుల భేటీ...
X
ఆంధ్రప్రదేశ్‌ లో సినిమా టికెట్ ధరలు - థియేటర్ల తనిఖీల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్నినాని ని కలిసి ఇండస్ట్రీ సమస్యల గురించి మరోసారి విన్నవించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. రేపు మంగళవారం ఏపీ మంత్రితో సినీ ప్రముఖుల బృందం సమావేశం అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఏపీలో సినిమా టికెట్‌ రేట్లు - థియేటర్లపై తనిఖీల విషయంలో ఇండస్ట్రీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.35 ప్రకారం సినిమా టికెట్ ధరలు అమలు చేయడం తమ వల్ల కాదంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా థియేటర్లు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. మరోవైపు నిబంధనల పేరిట అధికారులు పలు సినిమా హాళ్లను సీజ్ చేశారు.

థియేటర్లు మూతపడటం వల్ల సినీ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్స్ నష్టపోతున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు టికెట్ రేట్ల అంశం మీద బహిరంగంగా కామెంట్స్ చేస్తుండటంతో.. పరిస్థితులు ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతోందనే విధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ తో మంతనాలు జరిపి దీన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పలువురు ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వంతో చర్చల కోసం మంత్రి పేర్ని నాని ని అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సిధ్ధమని మంత్రికి తెలిపారని తెలుస్తోంది. కేవలం డిస్ట్రిబ్యూటర్స్ తో మాత్రమే మాట్లాడేందుకు మంత్రి ఓకే చెప్పగా.. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు 20మంది డిస్ట్రిబ్యూటర్లు మంత్రిని కలిసేందుకు అనుమతి లభించింది.

ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సినిమాటోగ్రఫీ మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. సినిమా టికెట్ రేట్ల అంశంపై పలువురు సినీ హీరోలు, నిర్మాతల వ్యాఖ్యలతో ఇబ్బంది పడుతున్నట్లు థియేటర్ యజమానులు, పంపిణీదారులు చెబుతున్నారు. అలానే ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లతో థియేటర్లు నిర్వహించలేమని.. దీనిపై పునరాలోచించుకోవాలని మంత్రిని కోరనున్నారు. మరి ఈ కీలక భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.