Begin typing your search above and press return to search.

అందగత్తెకి అదృష్టం కలిసొచ్చేనా?

By:  Tupaki Desk   |   13 Jun 2021 2:30 AM GMT
అందగత్తెకి అదృష్టం కలిసొచ్చేనా?
X
వెండితెరపై కథానాయికగా వెలిగిపోవాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు. ఆ అందానికి అభినయం కూడా తెలియాలి. అభినయం కూడా బాగా వచ్చేసి ఉంటే ఇక కెరియర్ కి ఢోకాలేనట్టేనా? అంటే, అప్పుడు కూడా హామీ ఇవ్వడం కష్టమే. కథానాయికగా నిలబడాలంటే అందం .. అభినయంతో పాటు అదృష్టం కూడా కావాలి. తెరపై అందంగా కనిపిస్తే ఆహా అంటారు .. చక్కని అభినయాన్ని పలికిస్తే అబ్బో అంటారు. కానీ ఆ సినిమా హిట్ అయితేనే తరువాత సినిమాకి పిలుస్తారు. అదృష్టం తోడు కావలసింది ఇక్కడే.

అందం .. అభినయం పుష్కలంగా ఉన్నవారిలో చాలామంది ఇంటిదారి పట్టడానికి కారణం అదృష్టం లేకపోవడమే. ఎవరు ఎంతగా .. ఎన్నివిధాలుగా కష్టపడినా, అదృష్టం ఉన్నప్పుడే ఆశించిన ఫలితం లభిస్తుందనేది చిత్రపరిశ్రమలో మరింత ఎక్కువగా నమ్ముతారు. అలా అదృష్టం తన కెరియర్ తో దోబూచులాడుతూ ఉండటంతో, మాళవిక నాయర్ కూడా చాలా కాలంగా ఉన్న చోటునే ఉండిపోయింది. మొహమాటపడుతుందో .. మొరాయిస్తుందో తెలియడంలేదు గానీ, అదృష్టం మాత్రం ఆమెకి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. ఆమె దానిని వెతికి పట్టుకునే ప్రయాత్నాల్లో ఉంది.

మాళవిక నాయర్ మంచి అందగత్తె .. గడుసైన ఆమె కళ్లు గారడీ చేస్తూ ఉంటాయి. చూపులతోనే ఎదుటివారి మనసులను స్వాహా చేయడంలో ఆమె నేర్పరి. 'ఎవడే సుబ్ర్రమణ్యం' వంటి హిట్ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమైనప్పటికీ, ఆ తరువాత పొలోమంటూ అవకాశాలు పోటెత్తింది లేదు. మధ్యలో 'టాక్సీవాలా'తో మరో హిట్ మాత్రం దక్కింది. ప్రస్తుతం ఆమె విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న 'థ్యాంక్యూ' సినిమాలో చేస్తోంది. ఈ సినిమాలోని ముగ్గురు కథానాయికలలో ఆమె ఒకరు. ఈ సినిమాతోనైనా అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి.