Begin typing your search above and press return to search.

మ‌ల్టీఫ్లెక్స్ బాదుడుకు కేసీఆర్ స‌ర్కార్ చెక్..

By:  Tupaki Desk   |   19 July 2018 5:59 AM GMT
మ‌ల్టీఫ్లెక్స్ బాదుడుకు కేసీఆర్ స‌ర్కార్ చెక్..
X
మ‌ల్టీఫ్లెక్సుల‌తో పాటు.. థియేట‌ర్ల‌లో సినిమా చూసే ప్రేక్ష‌కులంతా పండ‌గ చేసుకోవాల్సిన స‌మ‌య‌మిది. సినిమా టికెట్ రూ.150 అయితే.. పాప్ కార్న్ కు రూ.160 చెల్లించాల్సిన బాదుడుకు చెక్ పెడుతూ తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. మై మూవీ.. మై ఫుడ్ పేరుతో మ‌హారాష్ట్రలో న‌డిచిన ఉద్య‌మం నేప‌థ్యంలో.. మ‌ల్టీఫ్లెక్సుల్లోకి బ‌య‌ట పుడ్ తీసుకెళ్లేందుకు అనుమ‌తిస్తూ మ‌హారాష్ట్ర స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది.

ఈ నేప‌థ్యంలో తెలంగాణలోనూ ఇదే నిబంధ‌న‌ను అమ‌లు చేయాల‌న్న డిమాండ్ తెర మీద‌కు వ‌చ్చింది. తాజాగా ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని మ‌ల్టీఫ్లెక్సుల్లో బ‌య‌ట నుంచి ఆహారం తీసుకెళ్లేందుకు అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా తెలంగాణ రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర్వింద్ కుమార్ వెల్ల‌డించారు.

మ‌ల్టీఫ్లెక్సుల్లో ఆహార‌ధ‌ర‌లు ఆకాశాన్నిఅంటుతున్న నేప‌థ్యంలో బ‌య‌ట నుంచి ఆహారాన్ని థియేట‌ర్ల‌కు తీసుకొచ్చేందుకు వీలుగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌టం.. ఆగ‌స్టు 1 నుంచి ప్రేక్ష‌కులు బ‌య‌ట నుంచి ఆహారం తీసుకెళ్లేలా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన నోటిషికేష‌న్ ను చూసి.. వాటిని న్యాయ‌ప‌రంగా ప‌రిశీల‌న జ‌రిపిన త‌ర్వాత తెలంగాణ‌లోని మ‌ల్టీఫ్లెక్సుల్లో ప్రేక్ష‌కులు బ‌య‌ట నుంచి ఆహారం తీసుకెళ్లేలా ఉత్త‌ర్వులు జారీ చేయ‌నున్న‌ట్లుగా అర్వింద‌రావు ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు. ఆయ‌న ట్వీట్ పై ప‌లువురు ప్ర‌శంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. సో.. సినిమాలు చూడాల‌నుకునే వారు అన‌వ‌స‌ర‌మైన బాదుడు లేకుండా మ‌రిన్ని సినిమాలు చూసే అవ‌కాశం ల‌భించ‌నుంద‌న్న మాట‌.