Begin typing your search above and press return to search.

మళ్లీ సినిమాలో సినిమా కథేనా మాస్టారూ!

By:  Tupaki Desk   |   23 Jan 2022 6:36 AM GMT
మళ్లీ సినిమాలో సినిమా కథేనా మాస్టారూ!
X
సినిమా నేపథ్యంలో జరిగే కథతోనే చాలా సినిమాలు వచ్చాయి. అంటే తెరపై కూడా సినిమా గురించిన టాపిక్ నడుస్తుంటుంది .. సినిమా వాతావరణంలోనే కథ పరిగెడుతూ ఉంటుంది. ఇలాంటి కథల్లో ఏ మాత్రం కంటెంట్ ఉన్నా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంటాయి. ఎందుకంటే వాళ్లు ఆ పాయింట్ ను మరింత ఆసక్తితో .. మరింత దగ్గరగా చూడగలుగుతారు. అప్పుడెప్పుడో దాసరి చేసిన 'శివరంజని' .. ఆ తరువాత వంశీ చేసిన 'సితార' సినిమాలు సంచలన విజయాలను సాధించడానికి కారణం అదే.

ఇక ఆ తరువాత కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే వచ్చాయి. అయితే అంతగా ప్రేక్షకులను పట్టుకున్నవిగా మాత్రం కనిపించవు. ఇప్పుడు మళ్లీ అదే సినిమా నేపథ్యంతో ఇంద్రగంటి మోహనకృష్ణ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కూడా సినిమా కథ చుట్టూనే ట్రాలీ వేసుకుని మరీ తిరుగుతుందనే విషయం నిన్న వదిలిన టీజర్ ద్వారా అర్థమైంది. హీరోకి సినిమా డైరెక్టర్ ని కావాలనే బలమైన కోరిక ఉంటుంది. ఆ పట్టుదలతోనే ఆయన ముందుకు వెళుతుంటాడు. చూడగానే యువరాణిలా కనిపించే హీరోయిన్ కోసం వెదుకుతుంటాడు.

ఆ సమయంలోనే కృతి శెట్టి కనిపించడం .. ఆమెను ఒప్పించడానికి పడే కష్టాలతో ఈ కథ నడుస్తుంది. అయితే కంటి డాక్టర్ గా కృతి శెట్టి ఎంతవరకూ సెట్ అయినట్టు? అనే డౌట్ మాత్రం రాకమానదు. ఆ విషయం అలా ఉంచితే .. గతంలో ఇంద్రగంటి .. సుధీర్ బాబుతో చేసిన 'సమ్మోహనం' కూడా సినిమా నేపథ్యాన్ని కలుపుకుంటూనే నడుస్తుంది. ఆ సినిమా సక్సెస్ అయింది. అయితే మళ్లీ ఇప్పుడు ఆయన అదే సినిమా నేపథ్యంతో ఈ కథను రెడీ చేసుకున్నారు. కృతి శెట్టి క్రేజ్ .. ఆమె గ్లామర్ ప్లస్ పాయింట్ అయినప్పటికీ, మరి ఈ కథ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

ఇక ఈ సినిమా టీజర్ లో రాహుల్ రామకృష్ణ డైలాగ్ వింటే .. ప్రస్తుతం నడుస్తున్న కథలపై సెటైర్ వేసినట్టుగా అనిపిస్తుంది. రొటీన్ పాత్రలు .. రొటీన్ వాయిస్ లు .. రొటీన్ కథలు అంటూ ఈ పాత్రతో చెప్పించిన ఇంద్రగంటి, ఈ సినిమాలో ఎంతవరకూ కొత్తదనాన్ని చూపిస్తాడనేది చూడాలి. ఆయన అంత నమ్మకంతో అంత బలమైన డైలాగ్ కొట్టించాడంటే, ఈ సినిమాలో కంటెంట్ కరెంట్ పోల్ మాదిరి స్ట్రాంగ్ ఉంటుందనే అనుకోవాలి. కుర్రాళ్లు మాత్రం .. ఆయన ఆ అమ్మాయి గురించి ఏం చెప్పకపోయినా ఫరవాలేదు. చూస్తేనే కళ్లూ .. కడుపు నిండిపోతున్నాయని అనుకుంటున్నారు.