Begin typing your search above and press return to search.

డబ్బు కోసం దేవుడిని వాడేస్తున్నారా?

By:  Tupaki Desk   |   22 July 2015 6:25 PM GMT
డబ్బు కోసం దేవుడిని వాడేస్తున్నారా?
X
సినిమా వాళ్ల వాడకం గురించి అందరికీ తెలిసిందే. డబ్బు రాల్తుంది అంటే ఎంతకైనా తెగించేస్తారు. చివరికి దేవుడిని కూడా వదిలిపెట్టకుండా కమర్షియల్‌ చేసేయగలరు. ఇటీవలి కాలంలో ఈ ధోరణి మరీ విపరీతంగా పెరిగిపోయింది. ఓ మారు దేవుడిని మనవాళ్లు ఏ రేంజులో వాడుకున్నారో స్క్రీనింగ్‌ చేస్తే.. సీన్‌ ఇలా ఉంది.

అప్పట్లో 'బిజినెస్‌మేన్‌' సినిమాలో పూరీ దేవుడిని ఓ రేంజులో ఉపయోగించుకున్నాడు. వీలున్న ప్రతి సందర్భంలోనూ దేవుడు, నాస్తికత్వం అనే పాయింట్‌ని టచ్‌ చేస్తూ క్యూరియాసిటీ పెంచేయడంలో సక్సెసయ్యాడు. దేవుడా నేను బావుండాలి. నేనే బావుండాలి అని మొక్కుతారే కానీ, నువ్వు బావుండు. నువ్వే బావుండాలి అని ఎవరైనా మొక్కుతారా అంటూ కొత్త లాజిక్కు వెతికాడు. ఈ లాజిక్‌ ప్రేక్షకుడిని నిజంగానే ఆలోచించేలా చేసింది. దాంతో సినిమా కూడా సక్సెసైంది.

అలాగే ఆ తర్వాత గోపాల గోపాల చిత్రంలో ఏకంగా గోపాలుడినే కోర్టుకీడ్చాడు వెంకీ. ఓ మైగాడ్‌ కి రీమేక్‌ ఇది. దేవుడిని కోర్టుకీడిస్తే.. ఎన్ని ఎలుకలు బైటికొస్తాయో ఈ సినిమాలో చూపించారు. అటు హిందీ, ఇటు తెలుగు రెండు చోట్లా ఫార్ములా వర్కవుటైంది. అలాగే ఇటీవలి కాలంలో పీకే చిత్రంలో దేవుడిని విమర్శించడానికి ఏకంగా గ్రహాంతర వాసినే రంగంలోకి దించారు. అసలు దేవుడు-పూజలు అంటూ మూసలో కొట్టుకుపోయే జనాల్ని ఫుల్లుగా కెలికి దాంతో వచ్చే ఎమోషన్‌ ని క్యాష్‌ చేసుకున్నారు. పీకే ఏకంగా చైనా లో కూడా కలుపుకొని 740 కోట్లు వసూలు చేసింది.

ఇప్పుడు అంత మోతాదు లేదు కానీ బాహుబలి చిత్రంలోనూ దేవుడిని ఉపయోగించుకున్నారు. ఈ చిత్రంలో శివుడు శివలింగాన్ని గునపంతో తవ్వేసి భుజానికెత్తుకుని జలపాతం దగ్గరికి ఎత్తుకెళతాడు. ఇది శివభక్తులందరినీ ఉత్కంఠకు గురి చేసిందనడంలో సందేహమే లేదు. అయితే ఇలా కమర్షియాలిటీ కోసం దేవుడిని ఉపయోగించడం అనేది ఎంతవరకూ సబబు? అన్నదానికి ఫిలింమేకర్స్‌ సమాధానమివ్వాల్సి ఉంది.