Begin typing your search above and press return to search.

అమెరికా వ‌సూళ్ల‌కు బ్యాడ్ న్యూసేనా?

By:  Tupaki Desk   |   15 Sep 2019 1:30 AM GMT
అమెరికా వ‌సూళ్ల‌కు బ్యాడ్ న్యూసేనా?
X
అమెరికాలో సినిమా వీక్ష‌కుల‌ను `మూవీ పాస్` విధానం ఆక‌ర్షించిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ యాప్ లో టిక్కెట్ల ధ‌ర‌ల‌పై ఆఫ‌ర్ల వెల్లువ‌తో థియేట‌ర్ల‌కు వెళ్లే వారి శాతం పెరిగింద‌ని ముచ్చ‌టించుకున్నారు. అందువ‌ల్ల‌నే ఇటీవ‌ల రిలీజైన తెలుగు సినిమాల‌కు భారీ వ‌సూళ్లు సాధ్యమైంద‌ని ట్రేడ్ విశ్లేషించింది. అప్ప‌ట్లో భ‌ర‌త్ అనే నేను- రంగ‌స్థ‌లం స‌హా పలు చిత్రాల‌ క‌లెక్ష‌న్ల‌కు అది సాయ‌మైంది. అయితే ఉన్న‌ట్టుండి `మూవీ పాస్`ని ఎత్తేస్తున్నార‌న్న ప్ర‌చారంతో ఉన్న‌ట్టుండి షాక్ త‌గిలింది.

దీనికి సంబంధించి ప్ర‌ఖ్యాత హీలియోస్ అండ్ మాథ‌స‌న్ అన‌లిటిక్స్ తాజాగా ఓ రిపోర్ట్ ని అందించింది. మూవీ పాస్ కంపెనీ న‌ష్టాల్లో ఉంది. వాళ్లకు స‌రైన ఆదాయం లేద‌ని తేల‌డంతో ఈ యాప్ ని అమ్మేసేందుకు బ‌య్య‌ర్ల కోసం వెతుకుతున్నార‌ని పేర్కొంది. కొన్ని నెల‌ల క్రిత‌మే ఆ ప్లాట్ ఫామ్ ని ఎవ‌రికీ చెప్ప‌కుండా మూసేశార‌ని .. అది ఇంకా న‌డుస్తుందా న‌డ‌వ‌డం లేదా? అన్న‌దానిపై ఇన్నాళ్లు క్లారిటీ లేదని స‌ద‌రు అన‌లిటిక్స్ వెల్ల‌డించింది. దీనిపై మూవీ పాస్ వాళ్లు అధికారికంగా క్లారిటీని ఇవ్వ‌క‌పోవ‌డంతో స‌బ్ స్క్రైబ‌ర్స్ కూడా ఎగిరిపోయారు. గ‌త జూలై నుంచి ఈ ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో సెప్టెంబ‌ర్ 14 నుంచి మూవీ పాస్ ఎత్తేస్తున్న‌ట్టేన‌ని వెల్ల‌డించింది.

అమెరికాలో ఏఎంసీ థియేట‌ర్ల‌కు వెళ్ల‌డానికి మూవీపాస్ ప‌నికొస్తుంది. దీనిని ఏ- లిస్ట్ స‌ర్వీసెస్ అంటారు. అయితే ఇందులో కొన్ని స‌మ‌స్య‌లు పంటికింద రాయిలా త‌గిలాయి. మూవీ పాస్ యాప్ స‌రిగా ప‌ని చేయ‌క‌పోవ‌డం.. సాంకేతిక స‌మ‌స్యలు త‌లెత్తిన‌ప్పుడు ప‌రిష్క‌రించ‌లేక‌పోవ‌డం పెను స‌మ‌స్య‌గా మారింది. అలాగే ప్ర‌తిసారీ ప్లాన్స్ మార్చేయ‌డం.. ధ‌ర‌లు పెంచేయ‌డం వ‌ల్ల క‌స్ట‌మ‌ర్ కి చికాకు పుట్టింది. అమ‌ల్లోకి వ‌చ్చిన సేవ‌ల‌పై స‌రిగా ప్ర‌చారం లేకుండానే ఎప్ప‌టిక‌ప్పుడు ఇష్టానుసారం మార్చేయ‌డం వంటి త‌ప్పుడు ప‌నులు చేయ‌డంతో క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ లేకుండా పోయింది. దీనివ‌ల్ల మూవీపాస్ చిక్కుల్లో ప‌డిందని విశ్లేషిస్తున్నారు.

అయితే మూవీ పాస్ ఎత్తేయ‌డం వ‌ల్ల‌ తెలుగు సినిమాకి ఇబ్బందేనా? అంటే అలాంటిదేమీ లేద‌ని విశ్లేషిస్తున్నారు. తెలుగు సినిమా అమెరికా మార్కెట్ పై దీని ప్ర‌భావం ఉండ‌దు. అక్క‌డ మ‌న ఎగ్జిబిట‌ర్లు సొంత ప్లాట్ ఫామ్స్ పై స‌బ్ స్క్రైబ‌ర్ ప్లాన్స్ తో సిద్ధంగా ఉండ‌డం వ‌ల్ల `మూవీ పాస్` వ‌ల్ల ముప్పేమీ లేద‌ని వెల్ల‌డైంది. అయితే హాలీవుడ్ సినిమాల‌పై మాత్రం దీని ప్ర‌భావం ఉంటుంద‌ట‌. మునుముందు అమెరికాలో సైరా స‌హా ప‌లు టాలీవుడ్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాల వ‌సూళ్ల‌కు వ‌చ్చిన ముప్పేమీ లేద‌ని విశ్లేషిస్తున్నారు.