Begin typing your search above and press return to search.

రాబోయే రోజుల్లో సినిమా ప్ర‌మోష‌న్స్ ఇలా ఉండబోతున్నాయి...!

By:  Tupaki Desk   |   14 April 2020 11:30 PM GMT
రాబోయే రోజుల్లో సినిమా ప్ర‌మోష‌న్స్ ఇలా ఉండబోతున్నాయి...!
X
కరోనా మహమ్మారి ప్రభావం సినీ ఇండస్ట్రీపై ఏ రేంజ్ లో పడిందో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ చిత్ర పరిశ్రమలో చాలా మార్పులకు కారణం కాబోతోందని చెప్పవచ్చు. ఒక్కప్పుడు సినిమా విడుదల అంటే థియేటర్ల ముందు బారులు తీరే జనాన్ని ఇకపై చూసే అవకాశాలు లేకపోవచ్చు. టిక్కెట్ల కోసం చొక్కాలు చించుకొని.. ఒక పెద్ద ఫైట్ చేసి టికెట్స్ తీసుకొని విజయ గర్వంతో బయటకి సినీ ప్రేక్షకులను ఇప్పట్లో మనం చూసే ఛాన్సెస్ లేవనే చెప్పాలి. ప్రతి వారం ఏదొక సినిమాతో కళకళలాడుతుండే సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ పరిస్థితులు చక్కబడకపోవడంతో మరో రెండు వారాలు పొడిగించారు. పరిస్థితులు చూస్తుంటే సినిమా థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునేలా లేవు. ఇప్పటికే విడుదల తేదీలను వాయిదా వేసుకున్న సినిమాలు ఇప్పట్లో థియేటర్లలోకి వచ్చేలా కనబడటం లేదు. అందుకే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మూవీని డిజిటిల్ స్ట్రీమింగ్స్‌లో విడుదల చేయాలని కొంతమంది నిర్మాతలు భావిస్తున్నారు.

గ్రాండ్ రిలీజ్ ఇన్ అమెజాన్ ప్రైమ్...! నెట్ ఫ్లిక్స్ లో నేడే విడుద‌ల‌..! సినిమా ఇండ‌స్ట్రీ ఫ్యూచ‌ర్ ప్ర‌మోష‌న్స్ ఇలానే ఉండ‌బోతున్నాయి. ఎందుకంటే క‌రోనా మహమ్మారి కార‌ణంగా సినిమాలు చూడ‌టానికి థియేట‌ర్లు అవ‌స‌రం లేద‌నే వాస్త‌వం దాదాపు 30 శాతం సినీ ప్రేక్ష‌కులకి అర్థ‌మైపోయింది. ఏదో లార్జర్ దేన్ లైఫ్ సినిమాలు త‌ప్పిస్తే మిగ‌తా సినిమాలు అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజులు చేసుకునే టైమ్ వ‌చ్చేసింది. క్ర‌మ‌క్రమంగా చిన్న మొత్తంలో వ‌సూలు చేసే గ్రాస్ లు, షేర్ లు సినిమా ట్రేడ్ లెక్క‌ల్లోంచి తీసేస్తారు. హాలీవుడ్ మాదిరి బిలియ‌న్ డాల‌ర్స్ బిజినెస్ వ‌చ్చేస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. రెవెన్యూ షేర్ ప‌ద్ధ‌తిలో ఈ ఓటీటీ కార్పోరేట్స్.. సినిమా ఇండ‌స్ట్రీలపై పెత్త‌నం చేసే రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు. ఒకే రోజు రెండు మూడు సినిమా ఆన్ లైన్ స్ట్రీమ్ అయ్యేలా చేసి మ‌నలో మ‌న‌కే పోటీ సృష్టించి, వారు లాభ‌ప‌డ‌టం స్టార్ట్ చేస్తారు. ఇప్ప‌టికే చిన్న సినిమాల‌కి ఇదే ప‌ద్ధ‌తిని చాలా ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ స్టార్ట్ చేశాయి.

ఈ మధ్య వచ్చిన 'పలాస 1978' సినిమా థియేట‌ర్ లో కంటే ఓటీటీ ఫ్లాట్ పామ్స్ లో బాగా ఆడింద‌నే ప్ర‌చారాల్ని ఇప్పుడు మ‌నం ఆల్రేడి చూస్తూనే ఉన్నాం. అమెజాన్ ప్రైమ్ లో మా సినిమా స్ట్రీమ్ అవుతోందని నిర్మాత‌లే ఆ ఓటీటీ ఫ్లాట్ పామ్స్ పై యాడ్స్ ర‌న్ చేస్తూ వాటి బ్రాండ్ వాల్యూ ఇంకా పెంచుతున్నారు. ఇప్ప‌టికైనా పోయిందేమి లేదు.. అన‌వ‌స‌ర ఇగోలు పక్కన పెట్టి.. క్వాలిటీ కంటెంట్ కే మొద‌టి ప్రాధాన్య‌తనిస్తూ.. థియేట‌ర్స్, డిస్ట్రీబ్యూష‌న్ వ్య‌వ‌స్థ‌ల్లో ఉన్న చీక‌టి లొసుగుల్ని బ‌య‌టి పెడితే త‌ప్ప ఈ రాబోయే గండం గ‌ట్టేక్కే అవ‌కాశం లేదని సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఇండస్ట్రీ వాళ్ళు సినిమాల డిజిటల్ రిలీజుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.