Begin typing your search above and press return to search.

నితిన్ మార్కెట్ ని పాడు చేసిన సినిమా..?

By:  Tupaki Desk   |   3 Nov 2022 7:30 AM GMT
నితిన్ మార్కెట్ ని పాడు చేసిన సినిమా..?
X
యూత్ స్టార్ నితిన్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు దశాబ్దాల కెరీర్ లో ఎన్నో హిట్లు అందుకున్నాడు.. అన్నే ప్లాప్స్ చవిచూశాడు. అయితే గత కొంతకాలంగా కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ.. మంచి విజయాలు సాధించారు. ఈ క్రమంలో తన మార్కెట్ ని పెంచుకుంటూ వచ్చాడు. కానీ ఇటీవలి ప్లాప్ ఒక్కసారిగా అతని మార్కెట్ ని దెబ్బ తీసిందనే కామెంట్స్ వస్తున్నాయి.

నితిన్ హీరోగా ఎడిటర్ ఎస్ ఆర్ శేఖర్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ రూపొందించిన సినిమా ''మాచర్ల నియోజకవర్గం''. హోమ్ బ్యానర్ లో నితిన్ తండ్రి నిర్మించారు. ఆగస్ట్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఓపెనింగ్ డే వసూళ్లలో పర్వాలేదనిపించినా.. ఆ తర్వాతి రోజు నుంచి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.

థియేట్రికల్ రిలీజ్ లో పెద్దగా ప్రభావం చూపించలేపోయిన 'మాచర్ల నియోజకవర్గం'.. ఓటీటీలో మంచి ఆదరణ పొందుతుందని నితిన్ అభిమానులు భావించారు. అయితే ఈ సినిమా రిలీజై మూడు నెలలు కావొస్తున్నా.. ఇంతవరకూ డిజిటల్ వేదిక మీదకు రాలేదు. అయితే దీనికి కారణం సినిమా బాక్సాఫీస్ ఫలితమే అనే టాక్ ఉంది.

మాచర్ల సినిమా విడుదలకు ముందు నిర్మాతలు అనుకున్న ధరకి.. రిజల్ట్ చూశాక ఓటీటీ సంస్థ ఆఫర్ చేసిన రేటుకి చాలా వ్యత్యాసం ఉందట. డిజిటల్ హక్కుల ద్వారా వీలైనంత వరకూ నష్టాలను భర్తీ చేసుకోవాలని భావించిన మేకర్స్ కు ఈ రేటు గిట్టుబాటు కావడం లేదట. అందుకే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో జాప్యం జరుగుతోందని అంటున్నారు.

గత ఏడాది కాలంలో ఎన్నో పెద్ద సినిమాలు - బ్లాక్ బస్టర్ చిత్రాలు నెల తిరక్కుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ కబడ్డాయి. మొన్న దసరాకు రిలీజైన 'ది ఘోస్ట్' మరియు 'స్వాతిముత్యం' చిత్రాలు కూడా డిజిటల్ వేదికల మీదకు వచ్చేశాయి. అయితే ఆగస్టులో వచ్చిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా ఇంతవరకూ స్ట్రీమింగ్ కాకపోవడం గమనార్హం.

ఏదైనా సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ఓటీటీ సంస్థలు నేరుగా కొనే పరిస్థితి లేకపోతే.. వ్యూయర్ షిప్ విధానంలో స్ట్రీమింగ్ చేసి రెవిన్యూని షేర్ చేసుకుంటుంటారు. ఇటీవల కొన్ని సినిమాలు అలానే ఓటీటీలోకి వచ్చాయి. ఒకవేళ ఇప్పుడు నితిన్ చిత్రానికి అలాంటి పరిస్థితి వస్తే మాత్రం అది అతని మార్కెట్ పై పెద్ద దెబ్బ అనే అనుకోవాలి.

కెరీర్ ప్రారంభంలోనే మంచి విజయాలు అందుకున్న నితిన్.. కథల ఎంపికలో పొరపాట్లు చేసి వరుస పరాజయాలు అందుకున్నాడు. అయితే 'ఇష్క్' సినిమా తర్వాత ట్రాక్ మార్చి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ సాధించాడు. ఆ తర్వాత కొన్ని ప్లాప్స్ వచ్చాయి కానీ.. 'మాచర్ల నియోజకవర్గం' మాదిరిగా అతని మార్కెట్ ని పాడు చేయలేదు. మరి ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో నితిన్ మళ్లీ పుంజుకుంటాడేమో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.