Begin typing your search above and press return to search.

సినిమా థియేటర్లు మూసేస్తున్నారు.. బోర్డులు పెట్టేస్తున్నారు!

By:  Tupaki Desk   |   24 March 2021 2:30 PM GMT
సినిమా థియేటర్లు మూసేస్తున్నారు.. బోర్డులు పెట్టేస్తున్నారు!
X
సినిమా థియేట‌ర్ గేటు ముందు అరుదుగా రెండు ర‌కాల బోర్డులు క‌నిపిస్తుంటాయి. ఇందులో.. ఒక‌టి ‘సినిమా హాలు నిండిన‌ది’ అని రాసి ఉంటుంది. మరొకటి ‘ప్రేక్ష‌కులు లేని కార‌ణంగా ఆట ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది’ అని ఉంటుంది. మొదటి బోర్డును ఎక్క‌డో ఒక‌చోటైనా కొంద‌రు చూసి ఉంటారు. కానీ.. రెండో బోర్డు మాత్రం అత్యంత అరుదు. చాలా మంది చూసి ఉండ‌క‌పోవ‌చ్చు. అయితే.. ఇప్పుడు ఈ బోర్డులు త‌ర‌చూ క‌నిపిస్తున్నాయి!

లాక్ డౌన్ త‌ర్వాత సినిమా హాళ్లు సంక్రాంతికి తెరుచుకున్నాయి. ఆ త‌ర్వాత వేగంగా ప‌రిస్థితులు మారిపోయాయి. జ‌నం థియేట‌ర్ కు రావ‌డం కామ‌న్ అయిపోయింది. దీంతో.. సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వేట‌కు క్యూ క‌ట్టాయి. కానీ.. నెల‌కుఒక‌టి చొప్పున మూడు సినిమాలు మాత్ర‌మే సూప‌ర్ హిట్లుగా నిలిచాయి. జ‌న‌వ‌రిలో ‘కిక్‌’, ఫిబ్ర‌వ‌రిలో ‘ఉప్పెన‌’, మార్చిలో ‘జాతి ర‌త్నాలు’ మాత్రమే బ్లాక్ బస్టర్లుగా సత్తాచాటాయి.

అయితే.. లోతుగా గ‌మ‌నిస్తే ఇక్కడ ఒక విష‌యం అర్థ‌మ‌వుతోంది. హిట్ టాక్ కొట్టిన సినిమాకే కనక వర్షం కురుస్తోంది. ఏ మాత్రం డివైడ్ టాక్ వ‌చ్చినా పైసా రాల‌ట్లేదు! గ‌తంలో ప‌రిస్థితి మ‌రీ ఇలా ఉండేది కాదు. డివైడ్ టాక్ వ‌చ్చినా.. నెగెటివ్ టాక్ వ‌చ్చినా.. ఆ జోన‌ర్ ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కులు వెళ్లివ‌చ్చేవారు. ఆ విధంగా సినిమాలు భారీ న‌ష్టాల‌ను త‌ప్పించుకునేవి. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి తారుమారైంది.

కేవ‌లం హిట్ టాక్ స్ప్రెడ్ అయిన సినిమాల‌ను చూడ‌డానికి మాత్ర‌మే ఆడియ‌న్స్ క్యూ క‌డుతున్నారు. క‌రోనా నేప‌థ్యంలో దెబ్బ‌తిన్న ఆర్థిక స్థితిగ‌తులు ఒక కార‌ణ‌మైతే.. కొవిడ్ భ‌యం కూడా పూర్తిగా తొల‌గక‌పోవ‌డం మ‌రో కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇదివ‌ర‌కు వారానికి ఒక‌ సినిమాలు చూసిన‌వారు కూడా.. ఇప్పుడు నెల‌కు ఒక‌టి చూస్తున్న‌ట్టు లేరు. టైమ్ పాస్ కోసం, ఆహ్లాదం కోసం థియేట‌ర్ కు వెళ్లే సినీ ప్రేమికులు కూడా త‌మ ప‌ద్ధ‌తి మార్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇక సాధార‌ణ ప్రేక్ష‌కుడి గురించి తెలిసిందే. సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చిన త‌ర్వాత వీలుంటే వేళ్లేవారు. అలాంటి వారు ఇప్పుడు థియేట‌ర్ ముఖం కూడా చూసే ఆలోచ‌న చేసేట్టు క‌నిపించ‌ట్లేదు. ఈ విధంగా ప్రేక్ష‌కుల నిర్ణ‌యాలు మారిపోవ‌డం వ‌ల్ల‌నే మిగిలిన సినిమాల‌కు క‌లెక్ష‌న్లు రావ‌ట్లేదంటున్నారు అన‌లిస్టులు. మ‌రీ... సినిమా చూడ‌కుండా కూడా ఉండ‌లేం అనుకునేవారు.. హిట్ సినిమాల‌కు మాత్ర‌మే వెళ్తున్నారు. దీంతో.. వ‌చ్చిన సినిమాకే క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తుండ‌గా.. ఏ మాత్రం తేడా వ‌చ్చినా బాక్సాఫీస్ వ‌ద్ద‌ దారుణ‌మైన ఫ‌లితాన్ని చ‌విచూస్తున్నాయి మిగిలిన సినిమాలు.

ఆయా సినిమాల ప‌రిస్థితి ఎలా ఉంటోందంటే.. క‌నీసం థియేట‌ర్ మెయింటెన్స్ కు సైతం డ‌బ్బులు రాక‌పోవ‌డంతో.. త‌ర‌చూ సినిమా షోల‌ను ర‌ద్దు చేస్తున్నార‌ట‌. గ‌తంలో ఎప్పుడో ఒక‌టీఅరా చోట్ల‌ క‌నిపించిన ఈ ప‌రిస్థితి ఇప్పుడు.. త‌ర‌చూ క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. కాగా.. ఇప్పుడే ప‌రిస్థితి ఇలాఉంటే.. రాష్ట్రంలో, దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. మ‌రి, రాబోయే రోజుల్లో ప‌రిస్థితి ఇంకెలా ఉంటుందో చూడాలి.