Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు మోక్షం! APలో టిక్కెట్ల ధ‌ర‌ల‌పై కొత్త జీవో!!

By:  Tupaki Desk   |   7 March 2022 2:47 PM GMT
ఎట్ట‌కేల‌కు మోక్షం! APలో టిక్కెట్ల ధ‌ర‌ల‌పై కొత్త జీవో!!
X
గ‌డిచిన ఏడాది కాలంగా క‌రోనా మ‌హ‌మ్మారీ ఓవైపు సినీప‌రిశ్ర‌మ‌ను షంటేస్తుంటే ఏపీలో టిక్కెట్ ధ‌ర‌ల త‌గ్గింపు వ్య‌వ‌హారం చాలా మంది సినీపెద్ద‌ల‌ గుండెల్లో మంట‌లు పెట్టింది. టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు వెసులుబాటు లేక‌పోవ‌డంతో కోర్టుల ప‌రిధిలో పోరాటం సాగింది.

కానీ ఫ‌లితం లేదు. ఎట్ట‌కేల‌కు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సినీప‌రిశ్ర‌మ‌పై క‌రుణించారు. టికెట్ ధ‌ర‌ల్ని పెంచుతూ కొత్త జీవోని అధికారికంగా రిలీజ్ చేశారు. దీంతో టాలీవుడ్ లో సంబ‌రాలు మిన్నంటుతున్నాయి.

కొత్త సినిమా టిక్కెట్ల ధరల ఫైలుపై సీఎం జగన్ సంతకం చేశారు! అన్న వార్త‌తో ఒక‌టే సంద‌డి నెల‌కొంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీ సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించడం ఇంత‌కుముందు టాలీవుడ్ లో కలకలం రేపింది.

YSRCP ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరల పెరుగుదలకు బిగ్ జోల్ట్ ఇవ్వడంతో సినిమా వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. స‌రిగ్గా ఏడాది కింద‌ట‌ ఇది ఊహించ‌ని ప‌రిణామం. కొత్త టిక్కెట్ ధరలతో తమ పెట్టుబడులను రికవరీ చేయలేక రాష్ట్రంలోని అనేక థియేటర్లు మూతపడ్డాయి.

అయితే టాలీవుడ్ ప్రతినిధుల‌ బృందం సీఎం జగన్ మధ్య చర్చల తరువాత రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించి త్వరలో కొత్త జిఓ విడుదల చేయడానికి అంగీకరించింది. ఈ సమావేశంలో చిరంజీవి - టాలీవుడ్ కి చెందిన ఇతర అగ్ర తారలు రాష్ట్రంలో స్పెషల్ షోలకు అనుమతించాలని ధరలు పెంచాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.

ఇది ఫ‌లించి ఇప్పుడు రిజ‌ల్ట్ క‌నిపించింద‌ని తెలిసింది. సినిమా టిక్కెట్ల ధరలను పెంచే ఫైలుపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేశారు. ఈరోజు లేదా రేపు కొత్త జీఓ విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త జీవో ప్ర‌కారం మారిన టికెట్ ధ‌ర‌లు ప‌రిశీలిస్తే... ఏరియాని బ‌ట్టి ధ‌ర‌ల ప‌ట్టిక అమ‌ల్లోకి రానుంది.

కొత్త జీవో ప్ర‌కారం టికెట్ గ‌రిష్ఠ ధ‌ర రూ.250 కాగా.. క‌నిష్ఠ ధ‌ర రూ.20 గా ఉంది. దీనిపై అద‌నంగా జీఎస్టీ వ‌సూలు చేస్తారు. మున్సిపాల్టీల్లో నాన్ ఏసీ క‌నిష్ఠ ధ‌ర రూ.30 కాగా.. ఏసీ క‌నిష్ఠ ధ‌ర రూ.60గా ఉంది. కార్పొరేష‌న్ల‌లో నాన్ ఏసీ క‌నిష్ఠ ధ‌ర రూ.40 కాగా.. ఏసీ క‌నిష్ఠ ధ‌ర రూ.70 గా ఉంది. న‌గ‌ర పంచాయితీల్లో నాన్ ఏసీ క‌నిష్ఠ ధ‌ర రూ.20 కాగా ఏసీ క‌నిష్ఠ ధ‌ర రూ.50 గా ఉంది. మొత్తానికి రూ.10 టికెట్ ధ‌ర మాత్రం ఎక్క‌డా క‌నిపంచ‌లేదు.

త‌దుప‌రి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న భారీ చిత్రాల‌కు ఇత‌ర చిన్న సినిమాల‌కు ఇది గొప్ప వార్త‌. ముఖ్యంగా ప్రభాస్ కి ఇది శుభవార్త. అత‌డు న‌టించిన రాధే శ్యామ్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కొత్త జీఓతో ఆర్ .ఆర్‌.ఆర్- ఆచార్య- గ‌ని వంటి అనేక పెద్ద సినిమాలు APలో అద్భుతమైన కలెక్షన్ లను సాధిస్తాయ‌ని అంచ‌నా. మునుముందు కేజీఎఫ్ వంటి పాన్ ఇండియా చిత్రం కూడా విడుద‌ల కానుండ‌గా దీనికి పెద్ద వ‌రం అని చెప్పాలి.