Begin typing your search above and press return to search.

పెంచిన టికెట్ల ధరలతో సినిమాలకు పడిన దెబ్బ మామూలుగా లేదుగా?

By:  Tupaki Desk   |   6 Jun 2022 4:27 AM GMT
పెంచిన టికెట్ల ధరలతో సినిమాలకు పడిన దెబ్బ మామూలుగా లేదుగా?
X
మా సినిమా అద్భుతంగా ఉంటుంది. వెరైటీ కథ. ఇప్పటివరకు మీరెక్కడా చూడని రీతిలో సినిమా ఉంటుంది. కళ్లు చెదిరే గ్రాఫిక్స్.. ఇలా చాలానే మాటలు సినిమాలకు ముందు చెబుతుంటారు దర్శక నిర్మాతలు. కానీ.. ఇప్పుడు సీన్ మారింది. మా సినిమా సూపర్ గా ఉంటుందంటూనే.. తగ్గించిన ధరలతోనే సినిమాను ప్రదర్శించాలని డిసైడ్ చేశామన్న మాటను ప్రముఖంగా చెబుతున్న తీరు ఇప్పుడు నెలకొంది. ఎందుకిలా? అంటే.. కాసుల కక్కుర్తితో కొందరు నిర్మాతల అత్యాశ తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్రంగా దెబ్బ తీయటమే కాదు.. థియేటర్ కు రావాలంటూ బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కరోనా 3 వేవ్ తర్వాత.. అనుకున్న దాని కంటే ఆలస్యంగా థియేటర్లు మొదలయ్యాయి. ఏళ్లుగా విడుదలకు ఆగిన పెద్ద సినిమాలు.. క్రేజీ సినిమాల్ని మారథాన్ స్థాయిలో ఒకటి తర్వాత ఒకటి చొప్పున విడుదల చేయటం షురూ చేశారు. అగ్ర హీరోలతో నిర్మించిన ఈ భారీ చిత్రాలకు ఉండే సహజమైన క్రేజ్ ను సొమ్ము చేసుకోవటానికి వీలుగా టికెట్ ధరల్ని భారీగా పెంచేశారు. దీనికి ప్రభుత్వాలు (ఏపీ ప్రభుత్వం మొదట కారు చౌకగా టికెట్ల ధరల్ని తగ్గించేసి టాలీవుడ్ హాహాకారాలు చేసేలా చేసింది. ఆ తర్వాత పెంపునకు ఓకే చెబుతూ నిర్ణయం తీసుకుంది) సైతం ఓకే చెప్పాయి.

అగ్ర హీరోల సినిమాలు కావటంతో కలెక్షన్లకు కొదవ రాని పరిస్థితి. అయితే.. ఇందులోనూ సినిమా బాగోలేదన్న టాక్ వచ్చిన వాటికి కలెక్షన్లు దారుణంగా దెబ్బ పడిపోయిన పరిస్థితి. డిజాస్టర్ అంటూ ప్రచారం జరిగిన అగ్రహీరోల సినిమాలకు సైతం ఒక మోస్తరు కలెక్షన్లు ఉండేవి. అందుకు భిన్నమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఇలాంటివేళ.. కొన్ని చిన్న సినిమాలు విడుదల కావటం.. కలెక్షన్ల కక్కుర్తితో టికెట్ ధరను రూ.250, రూ.300 పెట్టి మల్టీఫ్లెక్సులు ప్రేక్షకుల వినోద బలహీనతను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశాయి.

దీంతో విసిగిపోయిన ప్రేక్షకుడు.. ఈ ధరాఘాతానికి తట్టుకోలేమంటూ సినిమా బాగున్నా.. థియేటర్ కు వెళ్లేందుకు జంకే పరిస్థితి. మూడు నెలల వ్యవధిలో టికెట్ల ధరలు పెంచినందుకు తగిన మూల్యాన్ని టాలీవుడ్ చెల్లించిన పరిస్థితి. అగ్ర హీరోల సినిమాలు.. క్రేజీ సినిమాలు విడుదలైతే తప్పించి థియేటర్ కు రాకూడదన్న నిర్ణయాన్ని ప్రేక్షకులు తీసేసుకోవటాన్ని కొందరు సినిమా నిర్మాతలు గుర్తించారు. ఇదే తీరును కొనసాగిస్తే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని రూటు మార్చారు.

తమ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా నిర్మించామని చెబుతూనే సినిమాను తగ్గింపు ధరలకే ప్రదర్శిస్తున్న విషయాన్ని ప్రముఖంగా చెప్పటం షురూ చేశారు. తాజాగా విడుదలై విజయవంతంగా రన్ అవుతున్న 'మేజర్' మూవీ దీనికో ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ సినిమాను చాలా సినిమాల కంటే భిన్నంగా హైదరాబాద్ లోని మల్టీఫ్లెక్సుల్లో సైతం రూ.195కు ప్రదర్శిస్తున్నారు. దీనికి ముందు పరిమిత బడ్జెట్ తో తీసిన సినిమాను సైతం రూ.250లను వసూలు చేసిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా టికెట్ ధరను ప్రేక్షకుడికి మరింత భారం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

లేదంటే.. ఇంట్లోనే ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద వీక్షించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. సినిమా ఉనికికే ప్రమాదమని చెప్పక తప్పదు. కొందరు అగ్ర నిర్మాతల కక్కుర్తి.. మొత్తం టాలీవుడ్ ను ముంచేసే వరకు వెళ్లటం గమానార్హం. ఈ ముప్పు నివారణకు తగ్గింపు ధరలతో సినిమాల్ని ప్రదర్శించటమే.