Begin typing your search above and press return to search.

50రోజుల త‌ర్వాతే ఓటీటీలోకి.. డ్యాషింగ్ డెసిష‌న్!

By:  Tupaki Desk   |   29 Jun 2022 2:48 PM GMT
50రోజుల త‌ర్వాతే ఓటీటీలోకి.. డ్యాషింగ్ డెసిష‌న్!
X
OTT ల‌ హవాను నిలువ‌రించేందుకు టాలీవుడ్ పెద్ద‌ల తాజా కీల‌క నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. తెలుగు ఫిల్మ్ మేకర్స్- డిస్ట్రిబ్యూటర్లు - ఎగ్జిబిటర్లు కొలువు దీరిన ఈ స‌మావేశంలో OTT ప్లాట్ ఫారమ్ లలో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న నియ‌మాన్ని స‌వ‌రించారు. కొత్త సినిమాలు ఇక‌పై థియేటర్ల‌లో విడుద‌లైన‌ 50-రోజుల త‌ర్వాత మాత్ర‌మే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ మేర‌కు నిర్ణ‌యాన్ని ఖ‌రారు చేశారు. ఇలా చేయ‌డానికి కార‌ణాలు అనేకం. ఓటీటీల వెల్లువ‌ థియేట్రికల్ కలెక్షన్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయ‌నేది ప్ర‌ధాన అభియోగం. అదే క్ర‌మంలో సినీపెద్ద‌లంతా చ‌ర్చించి దీనిపై కీల‌క నిర్ణ‌యం వెలువ‌రించారు.

OTT విడుదలకు '50 రోజుల థియేట్రికల్ విండో' అవ‌స‌ర‌మ‌ని.. దీని కోసం కీలకమైన సమావేశం టాలీవుడ్ లో జరుగుతుందని నిర్మాత బన్నీ వాసు 'పక్కా కమర్షియల్' ఈవెంట్ లో ఇంత‌కుముందే ప్రకటించారు. ఇంత‌లోనే తాజా నిర్ణ‌యం వెలువ‌డింది.

నిర్మాతలు - పంపిణీదారులు ప్రేక్షకులను థియేటర్ లకు రప్పించడానికి చాలా కష్టపడుతున్నారని బన్నీ వాసు నివేదించారు. సినిమా విడుదలతో పాటు ఏకకాలంలో OTT తేదీలను ప్రకటించడం వల్ల థియేట్రికల్ రన్ కూడా ప్రభావితమవుతోంద‌ని ఆయ‌న‌ ఆవేద‌నను వ్య‌క్తం చేసారు. ఈ విధానం చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది.. విష‌పూరిత‌మైన‌ది.. ఇది హీరోల మార్కెట్ కు కూడా హానికరం అని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ సాగుతోంది.

ఒక హీరో తన సినిమాని 50 రోజుల పాటు థియేటర్లలో చూడకుండా వేచి ఉండ‌లేడు. అందువ‌ల్ల ఆన్ లైన్ లో రాకుండా చేస్తేనే మేలు జ‌రుగుతుంద‌ని బ‌న్ని వాసు తన నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నార‌ని కూడా టాక్ ఉంది. బుధ‌వారం (29 జూన్) నాడు సినీపెద్ద‌ల‌ సమావేశంలో టాలీవుడ్ నిర్మాతలు దీనిపై ముఖ్యమైన నిర్ణయం తీసుకోవ‌డంపై హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఓటీటీ కిల్ల‌ర్స్ ని ఆపక‌పోతే..?

OTT ప్లాట్ ఫారమ్ లు పెద్ద ఎత్తున సినిమాలను స్వాధీనం చేసుకున్నాయి. పెద్ద స్క్రీన్ లలో విడుదలైన రెండు లేదా మూడు వారాల్లోనే సినిమాలు OTTలో విడుదలవుతుండడంతో ప్రేక్షకులు పెద్ద స్క్రీన్ లపై సినిమాలను చూడాలనే ఆసక్తిని కోల్పోయారు. దీంతో నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు తాజా నిర్ణ‌యం స‌హ‌క‌రిస్తుంద‌ని స‌మావేశం అనంత‌రం ప‌లువురు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు వ్యాఖ్యానించారు. అయితే 50 రోజుల నియ‌మం ఎంత‌వ‌ర‌కూ ఆచ‌ర‌ణ యోగ్యం అనేదానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.

ఓటీటీ రిలీజ్ ల‌తో పాటు టికెట్‌ రేట్ల కీలక అంశంపై కూడా ఈ భేటీలో చర్చించిన‌ట్టు స‌మాచారం. టికెట్ ధ‌ర‌ల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నారు? అన్న‌దానికి వివ‌రాలు అందాల్సి ఉంది.