Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పేలని దీపావళి టపాసులు..!

By:  Tupaki Desk   |   5 Nov 2021 12:30 PM GMT
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పేలని దీపావళి టపాసులు..!
X
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టాలీవుడ్ బాక్సాఫీస్ కు.. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు ఊపిరిపోసాయి. సినిమాలు చూడటానికి జనాలు థియేటర్ల వైపు చూస్తున్నారనే ధైర్యం రావడంతో వరుసగా క్రేజీ సినిమాలను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో దీపావళి పండుగను పురస్కరించుకుని 'మంచి రోజులొచ్చాయి' 'పెద్దన్న' 'ఎనిమీ' వంటి మూడు సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోడానికి థియేటర్లలోకి వచ్చాయి.

మారుతి దర్శకత్వంలో రూపొందిన ''మంచి రోజులొచ్చాయి'' సినిమాపై రిలీజ్ కు మంచి బజ్ ఏర్పడింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ - 'ఏక్ మినీ కథ' హీరో - యూవీ క్రియేషన్స్ వంటి పెద్ద బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ఒకరోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేయడంతో అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. అయితే విడుదల తర్వాత ఈ సినిమా మిశ్రమ స్పందన - మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. కథ ఆశించిన స్థాయిలో లేకపోవడం.. మారుతి మార్క్ కామెడీ మిస్ అవ్వడం వల్ల 'మంచి రోజులు వచ్చాయి' సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా పేలలేదని అంటున్నారు.

సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈసారి దీపాల పండుగకు ''పెద్దన్న'' గా పలకరించాడు. మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార - కీర్తి సురేష్ - మీనా - కుష్బూ - జగపతిబాబు - ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం నటించారు. కథ మెప్పించలేకపోతే ఎంతమంది ఉంటే ఏం లాభం. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచే నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంది. రజనీ ఫ్యాన్స్ ఆశించే అంశాలతో రొటీన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. డైరెక్టర్ శివ గతంలో తీసిన 'విశ్వాసం' 'వేదాలమ్' 'శౌర్యం' సినిమాలను మిక్సీలో వేసి తీస్తే రెడీ అయిన సినిమా ఇదని కామెంట్స్ వస్తున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అందించిన పాటలు కూడా నిరుత్సాహ పరిచాయి. మొత్తం మీద టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దన్న తుస్సుమనిపించాడని ఆడియన్స్ డిక్లేర్ చేశారు. రజనీ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా విషయంలో నిరాశకు గురయ్యారని తెలుస్తోంది.

కోలీవుడ్ హీరోలు విశాల్ - ఆర్య కలిసి చేసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ''ఎనిమీ'' కూడా దీపావళికి థియేటర్లలో కొలువుదీరింది. యాక్షన్ ప్రధానంగా డైరెక్టర్ ఆనంద్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ తప్ప మిగతా అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోయాయనే కామెంట్స్ వచ్చాయి. థమన్ అందించిన పాటల్లో ఒక్కటి కూడా జనాలకు రిజిస్టర్ కాలేదు. అందుకే ఈ సినిమా ఫలితం కూడా నిరుత్సాహ పరిచిందని అర్థం అవుతోంది. ఇలా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు పెద్దగా సౌండింగ్ చేయలేకపోయాయని తెలుస్తోంది.

దీపావళి పండుగ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు జనాలతో నిండిపోయాయి. అందుకే టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే ఓపెయినింగ్స్ తెచ్చుకున్నాయి. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కావడం.. గత వారం విడుదలైన సినిమాలేవీ పెద్దగా ప్రభావం చూపించకపోవడం ఈ మూడు సినిమాలకు కలిసొచ్చే అంశాలు. మరి దీపావళి సీజన్ ను క్యాసష్ చేసుకొని, ఈ మూడు రోజుల్లో ఎన్ని వసూళ్ళు రాబడతాయో చూడాలి.