Begin typing your search above and press return to search.

ప్రేమించినోడికి ఆమె హీరోయిన్ అని తెలిసి పారిపోయాడట!

By:  Tupaki Desk   |   13 Feb 2022 3:41 AM GMT
ప్రేమించినోడికి ఆమె హీరోయిన్ అని తెలిసి పారిపోయాడట!
X
చేదును మరిచి.. తీపిని మాత్రమే పంచుకోవటం ప్రముఖులకు అలవాటే. అందుకు భిన్నంగా కొందరు సెలబ్రిటీలు మాత్రం తమ జీవితాల్లోని వెలుగు చీకట్లను చెప్పుకోవటానికి ఏ మాత్రం మొహమాటపడరు. తాజాగా అలాంటి విషయాల్నే చెప్పి.. గడిచిన రెండు రోజులుగా వార్తల్లో తెగ నలుగుతోంది జెర్సీ బ్యూటీ మృణాల్ ఠాకూర్.

బుల్లితెర మీద నుంచి వెండితెర మీదకు ఎంట్రీ ఇవ్వటమే కాదు.. సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవటం.. వెంటనే హిందీ జెర్సీలో హీరోయిన్ ఛాన్సును సొంతం చేసుకోవటం ద్వారా.. పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుందీ బ్యూటీ.

తాజాగా ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇలాంటివేళ.. ఒక యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన తరుణంలో.. తనకు సంబంధించిన విషయాల్ని ఓపెన్ గా షేర్ చేసుకునేందుకు ఏ మాత్రం మొహమాటపడలేదు మృణాల్ ఠాకూర్. సాదాసీదా కంటే కూడా దారుణ పరిస్థితులు తన టీనేజ్ లో ఉండేవన్న విషయాన్ని చెప్పిన ఈ బాలీవుడ్ సంచలనం.. తన లవ్ స్టోరీ గురించి.. బ్రేకప్ గురించి వెల్లడించింది.

రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆమె స్టోరీ ఉండటం విశేషం. ఏడు నెలల క్రితం తన బ్రేకప్ జరిగిందని చెప్పిన ఆమె.. తాను ప్రేమించిన వ్యక్తి సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడని పేర్కొంది. పద్దతులు.. కట్టుబాట్లను ఫాలో అవుతాడని.. తామిద్దరం ఇష్టపడ్డామని చెప్పింది. అయితే.. తాను నటినని.. సినిమాల్లో నటిస్తానని తెలిసిన తర్వాత తనను విడిచి పారిపోయినట్లు చెప్పింది.

తనను విడిచి వెళ్లిపోయిన బాయ్ ఫ్రెండ్ మీద తనకు ఎలాంటి కోపం లేదన్న ఆమె.. ఇప్పుడు తామిద్దరం సర్దిచెప్పుకొని రిలేషన్ ను ముందుకు తీసుకెళ్లినా తర్వాత సమస్యలు తప్పవని పేర్కొంది.

తమకు పెళ్లై.. పిల్లలు పుట్టిన తర్వాత అయినా.. వాళ్లను పెంచే క్రమంలో అయినా గొడవలు రావొచ్చని.. అందుకే తన బ్రేకప్ గురించి తాను ఎక్కువగా ఆలోచించటం లేదని పేర్కొంది. విషయం ఏదైనా.. ఓపెన్ గా చెప్పేందుకు ఏ మాత్రం మొహమాటపడని మృణాల్ ఠాకూర్ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పక తప్పదు.