Begin typing your search above and press return to search.

ఆ మందు కొట్టిన నవ్వుకు వెయ్యేళ్ళు

By:  Tupaki Desk   |   16 April 2019 11:00 AM GMT
ఆ మందు కొట్టిన నవ్వుకు వెయ్యేళ్ళు
X
తెలుగు తెరపై మందు కొట్టి హాస్యం పండించే నటుల్లో మొదట గుర్తొచ్చే పేరు ఎంఎస్ నారాయణ. అప్పటిదాకా బ్రహ్మానందం హవాలో ఇంకెవరు ఆయన స్థాయిలో కామెడీ పండించలేని టైంలో తన అద్భుతమైన టైమింగ్ తో మద్యం సేవించిన పాత్రల్లో అలరించిన ఎంఎస్ నారాయణ దరిదాపుల్లోకి ఇప్పటితరం కమెడియన్స్ ఎవరు వెళ్లలేరు అనేది వాస్తవం.

మా నాన్న పెళ్లి సినిమాతో పరిచయమై డెబ్యూ మూవీతోనే నంది అవార్డు కొట్టేసిన ఎంఎస్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. ఆదిలో జూనియర్ ఎన్టీఆర్ మాటలకు ప్యాంటు తడుపుకునే ఆర్టిస్ట్ గా ఆనందంలో బ్యాచులర్స్ కుర్రాళ్ళ సరదాగా బలైపోయే ఇంటి ఓనర్ గా శివమణిలో రాంగ్ కాల్స్ అటెండ్ చేయాల్సి వచ్చే ఉద్యోగిగా ఇలా ఏ పాత్ర తీసుకున్నా దేనికదే ప్రత్యేకం అనే స్థాయిలో వాటిలో జీవించేవారు

అలా అని ఏంఎస్ అన్ని ఇలాంటి వాటికే పరిమితం కాలేదు. పిల్ల జమిందార్ లో తెలుగు మాస్టారుగా ఆయన నటనకు కన్నీళ్లు పెట్టని హృదయం లేదనటం అతిశయోక్తి కాదు. దూకుడులో స్టార్లను ఇమిటేట్ చేస్తూ ఇచ్చిన పెర్ఫార్మన్స్ కి థియేటర్లు నవ్వులతో దద్దరిల్లిపోయాయి. ఆ కాసేపు హీరో మహేష్ నే మరిచిపోయేంత మాయ చేశారీయన. ఇక అదుర్స్-పటాస్-ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు- నువ్వు నాకు నచ్చావ్-జులాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.

దర్శకుడిగా సైతం తన ముద్ర వేయాలని కొడుకు-భజంత్రీలతో ప్రయత్నం చేశారు కానీ అందులో మాత్రం విఫలమయ్యారు. ఇవాళ ఎంఎస్ పుట్టినరోజు. 46 ఏళ్ళ వయసులో కెరీర్ మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే 700 కు పైగా సినిమాలు చేసి అరుదైన రికార్డు సృష్టించిన ఎంఎస్ మనమధ్య లేకపోయినా ఆయన పంచిన నవ్వులు మాత్రం తెరమీద చిరకాలం చిరంజీవిగా ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా నిలిచిపోతాయి