Begin typing your search above and press return to search.

ఎమ్మెస్ లేకుండా ఏడాది గడిచింది

By:  Tupaki Desk   |   23 Jan 2016 11:30 AM GMT
ఎమ్మెస్ లేకుండా ఏడాది గడిచింది
X
టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ లేకుండా... తెలుగు సినీ ఇండస్ట్రీ ఏడాది గడిపింది. 2015 జనవరి 23న ఈ కమెడియన్ మనకు దూరమయ్యారు. 700లకు పైగా సినిమాల్లో నటించి, ఎన్నో నవ్వులు పంచిన ఎమ్మెస్ కు... నేడు తొలి వర్ధంతి. 1951 ఏప్రిల్ 16 న నిడమర్రులో పుట్టిన ఈయన.. 1997 నుంచి టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. సినిమాల్లోకి రాకముందు లెక్చరర్ గా పని చేసిన ఎమ్మెస్,.. తన 46 ఏళ్ల వయసులో సినిమాల్లో ప్రవేశించారు.

రవిరాజా పినిశెట్టి దగ్గర అసోసియేట్ గా చేస్తూ.. చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఎమ్మెస్ కు ఈవీవీ సత్యనారాయణ బ్రేక్ ఇచ్చారు. మా నాన్నకి పెళ్లి చిత్రం ద్వారా ఈయన ఒక్కసారిగా స్టార్ రేంజ్ కి వెళ్లిపోయారు. అక్కడి నుంచి టాలీవుడ్ లో ఎమ్మెస్ శకం మొదలైంది అని చెప్పాలి. మొత్తం ఐధు నంది అవార్డులు, ఒక ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్నారు ఈ సూపర్ కమెడియన్. ఈ తరం దర్శకులు ఎమ్మెస్ ప్రతిభను చక్కగా ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా శ్రీనువైట్ల ఎమ్మెస్ కోసం ప్రత్యేకమైన కేరక్టర్లు సృష్టించి స్ఫూఫ్ ల ద్వారా గిలిగింతలు పెట్టారు.

త్రివిక్రమ్ కూడా ఎమ్మెస్ నారాయణకు మంచి పాత్రలు చేయించారు. మహేష్ బాబు అతడు సినిమాలో.. 'అసలేం జరిగింది, ఏం జరుగుతోంది, నాకు తెలియాలి, తెలిసితీరాలి' డైలాగ్ అయితే.. ఇప్పటికీ, ఎప్పటికీ జనాల నోళ్లలో నానుతూనే ఉంటుంది. బ్రహ్మీ 20 ఏళ్లలో 700 సినిమాలు చేస్తే.. ఎమ్మెస్ ఈ ఘనతను 17 ఏళ్లలోనే సాధించడం విశేషం. ఎమ్మెస్ ప్రతిభను, ఘనతను గిన్నిస్ రికార్డుల్లో ఎంట్రీ చేయించడానికి సన్నిహితులు ప్రయత్నిస్తున్నారు.