Begin typing your search above and press return to search.

ఎగిసిపడిన హాస్యం పేరే ఎమ్మెస్!

By:  Tupaki Desk   |   23 Jan 2022 12:30 PM GMT
ఎగిసిపడిన హాస్యం పేరే ఎమ్మెస్!
X
తెలుగు తెరపై సందడి చేస్తూ కితకితలు పెట్టే కమెడియన్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరిలో ఎమ్మెస్ నారాయణ స్థానం ప్రత్యేకం. పశ్చిమ గోదావరి జిల్లా 'నిడమర్రు'లో ఆయన జన్మించారు. మొదటి నుంచి కూడా ఆయనకి కామెడీ సెన్స్ .. సమయస్ఫూర్తి ఎక్కువ. ఆయన ఎప్పుడూ కూడా ఆయన చాలా యాక్టివ్ గా ఉండేవారు. కాలేజ్ రోజుల్లోనే ఆయన హాస్యభరిత నాటకాలను రచించారు .. ప్రదర్శించారు. అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆయన, నటన పట్ల గల ఆసక్తితోనే సినిమా రంగం దిశగా అడుగులువేశారు.

'మా నాన్నకు పెళ్లి' సినిమాతో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఆయనను ప్రోత్సహించారు. అప్పటికే బ్రహ్మానందం స్టార్ కమెడియన్ గా చక్రం తిప్పేస్తున్నారు. ఆ సమయంలో ఈవీవీ 'మా నాన్నకి పెళ్లి' సినిమాను పట్టాలెక్కించారు. అందులో తాగుబోతు పాత్రకి హాస్యనటుడు కావాలి .. బ్రహ్మానందం ఫుల్ బిజీ .. దగ్గర్లో ఆయన డేట్లు లేవు. ఆ సమయంలో ఎమ్మెస్ నారాయణను తీసుకున్న ఈవీవీ ఆయనను పూర్తి స్థాయిలో ప్రోత్సహించారు. ఆ సినిమాలో ఆయన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ .. ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్వించాయి. ఇక అప్పటి నుంచి ఎమ్మెస్ నారాయణ వెనుదిరిగి చూసుకోలేదు.

బ్రహ్మానందం తరువాత ఆ స్థాయి హాస్యనటుడు దొరికాడని ఇండస్ట్రీ కూడా అనుకుంది. ఆయనకి వరుస అవకాశాలిస్తూ వెళ్లింది. అటు సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లోను .. ఇటు యంగ్ హీరోల సినిమాల్లోను ఆయన సందడి చేశారు. ఒకానొక దశలో ఆయన లేని సినిమా అంటూ ఉండేది కాదు. అత్యధిక పారితోషికం తీసుకునే హాస్యనటుల జాబితాలో .. అత్యంత వేగంగా 700 సినిమాలను పూర్తి చేసిన హాస్యం నటుల జాబితాలో ఆయన పేరు కనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో బ్రహ్మానందంతో కలిసి నటించిన ఎమ్మెస్, ఆయనతోనే శభాష్ అనిపించుకోవడం విశేషం.

ఎమ్మెస్ కి బాగా పేరు తెచ్చిపెట్టినవి తాగుబోతు పాత్రలే .. ఆ పాత్రల్లో ఆయన జీవించేవారు. ఇక 'దూకుడు' .. 'దుబాయ్ శీను' .. 'పటాస్' . 'అదుర్స్' సినిమాల్లో ఆయన నటనను మరచిపోవడం ఎవరివలనా కాదు. తన కెరియర్ మంచి జోరుమీద ఉండగానే, అనారోగ్యానికి గురైన ఆయన 2015 జనవరి 23వ తేదీన మరణించారు. ఆయనను ఎంతగానో అభిమానించేవారందరిచేత కన్నీళ్లు పెట్టించారు. తెలుగు తెరపై చెరగని నవ్వుల సంతకం చేసిన ఎమ్మెస్ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా మనసారా ఓ సారి ఆయనను స్మరించుకుందాం.