Begin typing your search above and press return to search.

స్టార్స్ తో సినిమాలు చేయకపోడానికి కారణమేంటో చెప్పిన ఎమ్.ఎస్. రాజు

By:  Tupaki Desk   |   31 July 2021 5:30 PM GMT
స్టార్స్ తో సినిమాలు చేయకపోడానికి కారణమేంటో చెప్పిన ఎమ్.ఎస్. రాజు
X
టాలీవుడ్ సీనియర్‌ ప్రొడ్యూసర్ ఎమ్.ఎస్ రాజు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'శత్రువు' 'మనసంతా నువ్వే' 'వర్షం' 'ఒక్కడు' 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా చెలామణి అయిన ఎమ్మెస్ రాజు.. ప్రభుదేవాని డైరెక్టర్ గా.. దేవిశ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేశాడు. త్రిష‌ - సిద్ధార్థ్ వంటి వారికి స్టార్ స్టేటస్ వచ్చేలా చేశాడు. మహేష్ బాబు కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ 'ఒక్కడు' చిత్రాన్ని నిర్మించిన సీనియర్ నిర్మాత.. 'వర్షం' చిత్రంతో ప్రభాస్ ని స్టార్ ని చేశాడు. 'మస్కా' సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఎంఎస్ రాజు.. చాలా గ్యాప్ తర్వాత 'డ‌ర్టీ హ‌రి' అనే సినిమాతో డైరెక్టర్ గా వచ్చాడు. ఇప్పుడు దర్శకుడిగా నాలుగో సినిమా "7 డేస్ 6 నైట్స్" తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

'డర్టీ హరి' సినిమా ఫలితం గురించి మాట్లాడుతూ "సినిమాని అందరూ మెచ్చుకున్నారు. ఓటీటీలో మంచి హిట్స్ వచ్చాయి. ఇది నాకు ప్రాఫిటబుల్ వెంచర్. నేను ట్రెండ్‌ కి తగ్గట్లుగా విభిన్నమైన సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నేను 'డర్టీ హరి' పోస్టర్స్ చూసిని చాలా మంది అనేక రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత చాలా బాగుందని ప్రశంసించారు. సినిమాకు ముందు ఉన్న నెగెటివ్ కూడా చూసిన తర్వాత పాజిటివ్ అయింది. అలానే కొందరు ఇలాంటి సినిమా మీరు ఎలా తీశారని ఆశ్చర్యపోయారు'' అని ఎమ్.ఎస్ రాజు చెప్పారు.

"7 డేస్ 6 నైట్స్ సాఫ్ట్ అండ్ బ్యూటీఫుల్ ఫిల్మ్. ఇందులో న్యూ ట్రెండీ థింగ్స్ ఉంటాయి. సినిమా టైటిల్ చూసి రకరకాల కథలు పుట్టుకొచ్చాయి. ఇది హీరోహీరోయిన్ల మీద నడిచే సినిమా కాదు. పాత్రల మధ్య ఉండే చక్కటి ఎమోషన్స్ తో నడుస్తుంది. యూత్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుంది. మా పిఆర్ టీమ్ నా కొడుకు కనిపించే విధంగా పోస్టర్ విడుదల చేద్దామని నాకు సలహా ఇచ్చాడు. కానీ నేను వద్దు అన్నాను. స్టోరీ పరంగానే వెళదామని వాళ్లతో చెప్పాను. 'అవతార్‌' సినిమాలో హీరోహీరోయిన్ల పేర్లు ఎవరికి తెలుసు? కేవలం జేమ్స్ కామెరాన్ పేరు చూసి మనం సినిమాకి వెళ్ళాం. ఇప్పటి వరకు ఏ సినిమా దాని కలెక్షన్స్ బీట్ చేయలేకపోయింది. నేను పాముని పెట్టి 'దేవి' అనే సినిమా తీసాను. సూపర్ హిట్ అయింది. నేను అదే కాన్ఫిడెంట్ తో ఉంటాను. స్టోరీని పాత్రలను మాత్రమే నమ్ముతాను. ఇందులో మా అబ్బాయి ఒక పాత్రకు సూట్ అయ్యాడు కాబట్టే తీసుకున్నాను. ఈ సినిమాతో 16మంది కొత్తవాళ్లను పరిచయం చేస్తున్నాను'' అని ఎమ్మెస్ రాజు అన్నారు.

స్టార్స్‌ ఇప్పుడు ఎందుకు సినిమాలు చేయడం లేదనే దాని గురించి ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ.. ''ఇప్పుడు నేను ఆ మూడ్ లో లేను. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా ఉన్నవారితో నేను సినిమాలు చేసినప్పుడు కూడా నేను వాళ్ళని మార్కెట్ కోసం యూజ్ చేసుకోవాలి అనుకోలేదు. నేను ఆ రోజుల్లో వారి మార్కెట్ విలువ కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాను తప్ప.. వారి స్టార్‌డమ్‌ తో సినిమాని అమ్మాలని ఎప్పుడూ అనుకోలేదు. 'డర్టీ హరి' తో హీరోహీరోయిన్లకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు కొత్తవాళ్లతో చేస్తున్నా. ఇలా నాకు ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు.. ఛాయిసెస్ ఉన్న హీరోల దగ్గరకు వెళ్లి నాతో సినిమా చేయమని నేను ఎందుకు అడగాలి?నా ఛాయిస్ తో నేను సినిమాలు చేయాలి" అని చెప్పుకొచ్చారు.

''ఇప్పుడు అందరూ పాన్ ఇండియా అంటున్నారు. నేను అప్పుడే 'దేవి' అనే పాన్ ఇండియా చేశాను. ఇప్పుడు అందరూ గ్రాఫిక్స్ అంటున్నారు.. నేను అప్పుడే గ్రాఫిక్స్ చూసాను. స్టార్స్ ని తీసుకోవాలని నేను ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. ఆ కథకు రైట్ అనుకున్నాను కాబట్టే తీసుకున్నాను. ప్రభాస్ స్టార్ కాకముందే నేను సినిమా చేసాను. 'రాజకుమారుడు' 'మురారి' వంటి రెండు మూడు మంచి సినిమాలున్న మహేష్ తో 'ఒక్కడు' సినిమా చేసాను. అప్పుడు 4 కోట్లు మహేష్ మార్కెట్ కి మించి 13-14 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసా. ప్రభాస్ మార్కెట్ కి అప్పుడు 2 రెండున్నర కోట్లు మించి సినిమా చేయకూడదు.. కానీ నేను 15 కోట్లు పెట్టి సినిమా చేసా. ఆ రెండు అప్పట్లో 30 కోట్లు చేశాయి'' అని అన్నారు.

ఈ సందర్భంగా 'దేవీపుత్రుడు' 'వాన' 'పౌర్ణమి' సినిమాల వల్ల లాస్ వచ్చిందని తెలిపిన రాజు.. అందరికి హిట్ ప్లాప్స్ వచ్చినట్లే నాకు వచ్చాయి అని చెప్పారు. ''ఒక హీరో ఫస్ట్ సినిమా చేస్తే స్టోరీ అడగడు.. రెండో సినిమాకి కూడా ఒకే అంటాడు. కానీ మూడో సినిమాకి వచ్చే టైం స్టోరీ ఏంటని అడుగుతాడు. అందుకే నేను నాకు లోబడే సినిమాలు చేస్తుంటాను. ఒకవేళ స్టోరీ చెప్పినా అది మార్చండి ఇది మార్చండి అంటారు. ఎప్పుడూ ఒకళ్ళు అనుకున్న కథతో సినిమా చేయకూడదు.. నేను అనుకున్న కథతో సినిమా చేయాలని అనుకుంటా. అది హిట్ అయినా ప్లాప్ అయినా నా కథ అయితే క్రెడిట్ తీసుకుంటా'' అని ఎమ్మెస్ రాజు అన్నారు.

స్టార్ హీరోల చుట్టూ తిరిగి 50-70 కోట్లు అడ్వాన్స్ లు ఇచ్చి, వాళ్ళు ఏది అడిగితే అది చేసే స్టేజికి నేను రావాలనుకోవడం లేదని ఆయన అన్నారు. తనతో సినిమాలు చేసిన హీరోలు ఒకప్పటిలా పూర్తి స్టోరీ అడగకుండా.. దేంట్లో కలుగజేసుకోకుండా ఉండరేమో అనే భయంతోనే తాను వారి దగ్గరకు వెళ్లడం లేదని ఎమ్మెస్ రాజు వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'దేవి' 'మనసంతా నువ్వే' సినిమాలకు కలిగిన ఆనందం.. పెద్ద పెద్ద సెట్స్ వేసి పెద్ద హిట్లు కొట్టినా నాకు కలగలేదు. ఎందుకంటే ఆ సినిమాలను మార్కెట్ చేయడం చాలా కష్టం. అందుకే అవి సక్సెస్ అయితే హ్యాపీగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.