Begin typing your search above and press return to search.

ముద్రగడ మిడిల్ డ్రాప్ అవుతారా?

By:  Tupaki Desk   |   6 Feb 2016 9:11 AM GMT
ముద్రగడ మిడిల్ డ్రాప్ అవుతారా?
X
కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ తో ఆమరణ దీక్ష ప్రారంభించిన ముద్రగడ పద్మనాభం తన దీక్షను కొనసాగించేందుకు ఇష్టంగా లేరా? ఆవేశంలో చేసిన ప్రకటన మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో దీక్షకు దిగారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రభుత్వంతో తాను చర్చలకు సిద్ధం అంటూ పదేపదే ఆయన చెబుతుండడం... దీక్షకు కూర్చోవడానికి ముందు కూడా చర్చలకు రెడీ అని ప్రకటించడాన్ని చూస్తే ఆయనకు దీక్ష పూర్తిగా ఇష్టమున్నట్లు లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే... వివిధ పార్టీల నేతలంతా వచ్చి సంఘీభావం తెలుపుతుండడం... మీరు గ్రేట్ అంటూ పొగుడుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన దీక్షకు దిగాల్సి వచ్చిందంటున్నారు. దీంతో ఆయన ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీక్ష ముగించాలని అనుకుంటున్నారన్న వాదన ఒకటి వినిపిస్తోంది.

నిజానికి ముద్రగడ మొండివారే. అంత తేలిగ్గా లొంగే ఘటం కాదు... గతంలో ఆయన తన ఇంట్లోనే దీక్ష చేసినప్పుడు చాలా పట్టుదలగా వ్యవహరించారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఆయనకూ వయసు పెరిగింది. మునుపటి స్పీడు తగ్గింది. అయినా కూడా కాపుల కోసం రంగంలోకి దిగిన ఆయన వైసీపీ చివరి వరకు తోడు ఉంటుంది కాబట్టి పోరాడొచ్చు అనుకున్నారు. కానీ.... వైసీపీని నమ్ముకుని ఆయన దెబ్బయ్యారని అంటున్నారు. ఉద్యమంలో ప్రవేశించిన వైసీపీ అక్కడ హింస జరగడం... ఆ హింసకు కారణం వైసీపీయేనని ప్రభుత్వం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటుండడంతో ఈ వ్యవహారం నుంచి దూరంగా జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే... దీక్షను ముందే ప్రకటించిన ముద్రగగడకు మాత్రం అది చేపట్టక తప్పలేదు. పైగా తెలుగు రాష్ట్రాల్లోని నేతలు ఆయన్ను ఆకాశానికెత్తుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దీక్షకు దిగిన ఆయన తన ఆరోగ్యంపై ఆందోళనగా ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం ఏదో రకంగా బెటర్ హామీ ఇస్తే నిమ్మరసం తాగేయాలని అనుకుంటున్నారని తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.