Begin typing your search above and press return to search.

ఆ దేశాల్లో మల్టీఫ్లెక్సులు ఓపెన్.. మన దగ్గర మాటేంటి?

By:  Tupaki Desk   |   4 July 2020 12:45 PM IST
ఆ దేశాల్లో మల్టీఫ్లెక్సులు ఓపెన్.. మన దగ్గర మాటేంటి?
X
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి పుణ్యమా అని.. దేశాలకు దేశాలు పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న వేటిని అనుమతించటం లేదు. తొలిదశలో లాక్ డౌన్ ను విధించినా.. దీర్ఘకాలంలో అలాంటి పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితిని కుంగదీయటంతో పాటు.. నడుం విరిగేలా చేస్తుందన్న సత్యాన్ని గ్రహించాయి. దీంతో.. లాక్ డౌన్ కు అన్ లాక్ చేయటం షురూ చేశాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పలు వ్యాపార సముదాయాలు ఓపెన్ చేసేందుకు అనుమతిని ఇచ్చేశారు. ఇదిలా ఉంటే.. మరికొన్నింటి విషయంలో పరిమితుల్ని అలానే ఉంచారు. అలాంటి వాటిల్లో బార్లు.. పబ్ లు.. మల్టీఫ్లెక్సులు.. బ్యూటీ స్పాలు తదితరాలు ఉన్నాయి.

మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు మూతపడటంపై ఆ రంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. వినోద రంగం ప్రభావితం కావటమే కాదు.. ఆ రంగాన్ని నమ్ముకున్న లక్షలాది మంది మాత్రమే కాదు.. మల్టీఫ్లెక్సుల మీద ఆధారపడి బతికే లక్షల మందికి ఇప్పుడో సవాలుగా మారింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మరికొన్ని నెలలు మల్టీఫ్లెక్సులు ఓపెనయ్యే అవకాశం కనిపించట్లేదు. మరి.. వివిధ దేశాల్లో పరిస్థితి ఏమిటన్న విషయాన్ని చూస్తే.. ఆసక్తికరఅంశాలు కనిపిస్తాయి. ఇప్పటివరకూ ఇటలీ.. శ్రీలంక.. ఫ్రాన్స్.. ఆస్ట్రేలియా.. బెల్జియం.. స్పెయిన్.. నెదర్లాండ్స్.. మలేషియా.. అమెరికా లాంటి దేశాల్లో మల్టీఫ్లెక్సుల్ని ఓపెన్ చేశారు.

భౌతిక దూరంతోపాటు.. వివిధ జాగ్రత్తల్ని తీసుకుంటూ వాటిని నిర్వహిస్తున్నారు. ఏపీ కూడా ఎక్కువగా లేకుండా ఉండేలా మల్టీఫ్లెక్సుల్ని రన్ చేస్తున్నారు. ఇదే తీరును మన దేశంలోనూ అమలు చేయాలని కోరుతున్నారు. మల్టీఫ్లెక్సుల్ని మూసివేయటం ద్వారా..కోట్లాది రూపాయిల నష్టంతో పాటు.. లక్షలాది మంది జీవనోపాధికి గండంగా మారింది. మల్టీఫ్లెక్సులు బంద్ కావటంతో.. ఆ స్థానాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ భర్తీ చేయటం సాధ్యం కాదంటున్నారు. చిన్న.. బడ్జెట్ సినిమాలకు ఓకే కానీ.. భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదల కావటంతోనే వర్క్ వుట్ అవుతాయే తప్పించి.. ఓటీటీ తో సాధ్యం కాదంటున్నారు.

మరి.. మల్టీఫ్లెక్సులు ఓపెన్ చేయాలంటే.. సీటుకు సీటుకు మధ్య దూరాన్ని ఉంచటం.. అదనపు శానిటైజేషన్ లాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు టికెట్ ధర లాంటి భారం తప్పదంటున్నారు. అదే జరిగితే ప్రేక్షకులు మల్టీఫ్లెక్సులకు వస్తారా? అన్నది మరో ప్రశ్న. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. మా తిప్పలు మేం పడతాం.. మాకు ఇవ్వాల్సిన అనుమతులు ఇస్తే చాలని మల్టీఫ్లెక్సు యజమానుల సంఘం కోరుతోంది. మరి.. వీరి వినతుల్ని ప్రభుత్వం ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందన్నది మాత్రం ప్రశ్నగా మారింది.