Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎత్తేసినా మల్టీప్లెక్స్‌లకు కష్టాలు తప్పవా...?

By:  Tupaki Desk   |   11 April 2020 4:00 AM GMT
లాక్ డౌన్ ఎత్తేసినా మల్టీప్లెక్స్‌లకు కష్టాలు తప్పవా...?
X
కరోనా నిర్మూలనలో భాగంగా దేశంలో లాక్‌ డౌన్‌ విధించడంతో పలు రంగాలు ఇప్పటికే కుదేలయ్యాయి. సినీ పరిశ్రమ విషయానికి వస్తే దీని ప్రభావం కాస్త గట్టిగానే ఉంది. లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్‌ లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. షూటింగ్స్ లేక ఎందరో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప‌లువురు సెల‌బ్రిటీలు ప్ర‌భుత్వాల‌కు విరాళాల‌ను అందించ‌డ‌మే కాకుండా నైతికంగా త‌మ మ‌ద్ద‌తుని తెలియ‌జేస్తున్నారు. ఇప్పటి వరకు మందు కనిపెట్టని ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ పతనమవుతుంది. కరోనా ఎఫెక్ట్‌ తో ఇప్పుడు ప్రజలందరూ కలిసి పలకరించుకోలేని పరిస్థితి నెలకొంది.

రోజురోజుకు కరోనా మరింత తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో లాక్‌ డౌన్‌ ను మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉన్నట్లు దాదాపుగా ఖాయం కావడంతో ఆగిపోయిన షూటింగ్‌ లు, -కొత్త షూటింగులు - థియేటర్లు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన మల్టీప్లెక్స్ యాజమాన్యాలు - థియేటర్ల ఓనర్లు కంగారు పడుతున్నారు. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసినా దేశవ్యాప్తంగా ఉన్న సినిమాస్.. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లు జూన్ 30 వరకు మూసివేయబడతాయని తెలుస్తోంది. ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తేసినా పివిఆర్ - ఐనాక్స్ - కార్నివాల్ సినిమాస్ - సినీపోలిస్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్స్ మే 31 వరకు తెరవకూడదని ఇంతకముందే నిర్ణయించుకున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే లాక్ డౌన్ ఎక్స్టెన్షన్ పరిశీలిస్తే జూన్ 30 వరకు థియేటర్లను మూసివేయమని ప్రభుత్వం వీరిని కోరే అవకాశం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా వీటిపై భారీగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం పంపిణీదారులకు - నిర్మాతలకు - మీడియం బడ్జెట్ చిత్ర నిర్మాతలకు ఎక్కువ ఆదాయాన్ని తీసుకొస్తుంది మల్టీప్లెక్స్‌ లు మాత్రమే. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు జూన్ 30 దాకా మూసేయాల్సి వస్తే ఇంకా పీకల్లోతు కష్టాల్లో పడే అవకాశం లేకపోలేదు. ఈ ప్రభావం కేవలం మల్టీప్లెక్స్‌ లు మీద మాత్రమే కాదు సింగిల్ స్క్రీన్ థియేటర్ల మీద కూడా పడనుంది. ఎందుకంటే ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేసినా అన్ని రంగాలను ఒకేసారి తెరిచే అవకాశం లేదు.

కరోనా వ్యాప్తి నివారణకు ముందు ప్రాధాన్యతా రంగాల మీద ఎత్తేసి తర్వాత జన సమూహాలతో ఉండే సినిమా థియేటర్ల మీద ఎత్తేసే అవకాశం ఉంది. కరోనా ప్రభావం సినిమాల మీద మరో రెండు నెలలు ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయం. కానీ థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్లకు రాకపోవచ్చని.. ఇలాంటి పరిస్థితి సుమారు 3 నుండి 4 నెలలు ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ఇన్నేళ్ల చరిత్ర ఉన్న సినీ రంగాన్ని కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి వణికించిందని చెప్పవచ్చు.