Begin typing your search above and press return to search.

ముమైత్ విచార‌ణ‌కు రావ‌ట్లేదు: అకున్ స‌బ‌ర్వాల్‌

By:  Tupaki Desk   |   18 July 2017 3:25 PM GMT
ముమైత్ విచార‌ణ‌కు రావ‌ట్లేదు: అకున్ స‌బ‌ర్వాల్‌
X
రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన డ్ర‌గ్స్ కేసులో సినీ ప్ర‌ముఖుల విచార‌ణ రేప‌టి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి 27 వ‌ర‌కు ఒక్కొక్క‌రిని సిట్ అధికారులు విచారించ‌నున్నారు. మొద‌ట‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ రేపు ఉద‌యం 10.30 నిమిషాల‌కు సిట్ విచారణ‌కు హాజ‌రు కానున్నారు. అయితే, ఈ విచార‌ణ నుంచి ముమైత్ ఖాన్ కు మిన‌హాయింపు ల‌భించింద‌ని ఎక్సైజ్ (ఎన్‌ ఫోర్స్‌ మెంట్) డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పారు. ముమైత్‌ ఖాన్‌ మినహా అందరూ విచారణకు హాజరు అవుతారన్నారు. డ్రగ్స్‌ మాఫియాపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని, తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని అకున్‌ సబర్వాల్‌ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు.

నోటీసులు తీసుకున్న వారిలో ముమైత్‌ఖాన్ మినహా అందరూ హాజరవుతారని, ముమైత్ ఖాన్ ఓ షోలో ఉన్నందున ఆమె విచారణ తేదీని ఇంకా నిర్ణయించలేదని సబర్వాల్ తెలిపారు. ఒక్కో రోజు ఒక్కొకరిని విచారిస్తామని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని అకున్ చెప్పారు. డ్రగ్స్ కేసులో కొత్తవాళ్లకు నోటీసులు ఇవ్వలేదని ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఓ టీవీ చానల్‌లో బిగ్‌ బాస్‌ కార్యక్రమంలో ముమైత్‌ ఖాన్‌ పాల్గొన‌డం వ‌ల్లే స్వయంగా సిట్‌ ఎదుట హాజరు అయ్యేందుకు మినహాయింపు లభించినట్లు తెలుస్తోంది.

కాగా, డ్ర‌గ్స్ కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్ర‌ముఖులు ఈ నెల 19 నుంచి 27 మధ్య సిట్‌ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకానున్న సంగ‌తి తెలిసిందే. కెల్విన్‌ కాల్‌ లిస్ట్‌ ఆధారంగా వీరికి తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నోటీసులు జారీచేసింది. ఈ నెల 19న పూరీ జగన్నాథ్‌ - 20న హీరోయిన్ ఛార్మి - 22న సుబ్బరాజు - 23న శ్యాం కే నాయుడు సిట్‌ ఎదుట హాజరుకాబోతున్నారు. ఇక హీరో రవితేజ ఈ నెల 24న సిట్ ముందు హాజ‌రు కాబోతున్నారు. ఈ నెల 25న చిన్నాను - 26న నవదీప్‌ - 27న తరుణ్‌ - 28న తనీష్‌ - నందులను సిట్‌ విచారించనుంది.