Begin typing your search above and press return to search.

సూసైడ్ చేసుకున్న వర్థమాన నటి

By:  Tupaki Desk   |   30 Aug 2019 5:05 AM GMT
సూసైడ్ చేసుకున్న వర్థమాన నటి
X
తళుకుబెళుకుల సినీ రంగంలో ఒక వెలుగు వెలగాలని కలలు కనేవారెందరో. వేలాది మంది ప్రయత్నిస్తే.. అవకాశం లభించేది ఏ ఒకరిద్దరికో. ఇక.. పేరు ప్రఖ్యాతులు రావాలంటే ఎన్నో అంశాలు కలిసి రావాలి. ప్రయత్నాలు చేసి ఫెయిల్ వారి కథలు ఒక్కోలా ఉంటాయి. తాజాగా అలాంటి విషాదమే ముంబయిలో చోటు చేసుకుంది.

లోఖండ్ వాలా ప్రాంతంలోని కెన్ వుడ్ బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న వర్థమాన నటి ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. భవనం పై నుంచి పెద్దశబ్ధం రావటంతో.. పూలకుండీ కింద పడిపోయిందని భావించారు. తీరా చూస్తే.. రక్తపు మడుగులో ఒక యువతి ఉండటాన్ని గుర్తించి.. పరుగు పరుగున ఘటనాస్థలానికి వెళ్లారు.

ఇంతకీ ఆమె ఎవరో కాదు.. పాతికేళ్ల పెర్ల్ పంజాబీ. బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిపోవాలని.. తల్లిదండ్రుల్ని ఎదిరించి.. వారి ఇష్టానికి వ్యతిరేకంగా సినీ అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నించి విసిగిపోయి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు.

పాతికేళ్ల పెర్ల్ పంజాబీ.. తన టాలెంట్ ఫ్రూవ్ చేసుకోవాలని తెగ ప్రయత్నం చేసింది. అవకాశాల కోసం ఫిలిం ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఆఫర్లు రాలేదు. హీరోయిన్ గా వెలిగిపోవాలన్న ఆమె ఆశకు భిన్నంగా చిన్న చితకా పాత్రలు తప్పించి.. పెద్ద అవకాశం ఏదీ రాలేదు. దీంతో.. విసిగిపోయిన ఆమె ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగానికి చేరింది. తీవ్రమైన మానసిక ఒత్తిడి.. తల్లితో ఆమెకున్న విభేదాల నేపథ్యంలో బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. సినిమాల్లో వెలిగిపోవాలనుకున్న ఆమె ఆశను నిరాశ ఓడించటమే కాదు.. ప్రాణాల్ని తీసేసింది.