Begin typing your search above and press return to search.

రజనీని 100 కోట్లు కట్టమంటున్న జర్నలిస్టు

By:  Tupaki Desk   |   4 Jun 2018 8:40 AM GMT
రజనీని 100 కోట్లు కట్టమంటున్న జర్నలిస్టు
X
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘కాలా’కు ఎటు చూసినా తలనొప్పులే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ చిత్రానికి కర్ణాటకలో బ్రేక్ పడ్డట్లే కనిపిస్తోంది. కావేరీ జల వివాదానికి సంబంధించి కర్ణాటకకు వ్యతిరేకంగా రజనీ వ్యవహరించిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని తమ రాష్ట్రంలో విడుదల చేయనిచ్చేది లేదని కర్ణాటకలోని పలు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. రజనీ సారీ చెప్పినా కూడా సినిమా విడుదల కాదని తేల్చేశాయి. దీంతో నిర్మాత ధనుష్.. ఈ చిత్ర కర్ణాటక హక్కులు కొన్న వాళ్లు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. మరోవైపు తమిళనాట స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రజనీ చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ నార్వే.. స్విట్జర్లాండ్ దేశాల్లోని పలువురు తమిళులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన నేపథ్యంలో అక్కడ కూడా ఈ సినిమా రిలీజ్ కాదని అంటున్నారు.

ఈ కష్టాలు చాలవన్నట్లు ‘కాలా’కు మరో అడ్డంకి మొదలైంది. ఈ చిత్రంలో రజనీ పోషించిన పాత్ర.. తన తండ్రి థిరవియం నాదర్ స్ఫూర్తితో తెరకెక్కిందని.. తన అనుమతి లేకుండా తన తండ్రి కథను సినిమాగా తీసినందుకు పరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు ముంబయికి చెందిన జవహర్ అనే జర్నలిస్టు. తన తండ్రి తమిళనాడు నుంచి ముంబయికి వచ్చి అక్కడ ప్రజా సమస్యలపై పోరాడాడని.. ఆయన కథనే ‘కాలా’గా తీశారని అతనంటున్నాడు. కనీసం తమతో సంప్రదించకుండా తన తండ్రి కథను ఎలా సినిమాగా తీస్తారని అతనంటున్నాడు. ఆల్రెడీ లాయర్లతో ఈ చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు కూడా ఇప్పించాడు జవహర్. ఈ ఇష్యూ తేలకుండా సినిమాను విడుదల కానిచ్చేది లేదని.. తన న్యాయ పోరాటం కొనసాగుతుందని అతను స్పస్టం చేశాడు. మరి అతడితో వివాదాన్ని ‘కాలా’ టీం ఎలా సెటిల్ చేసుకుంటుందో చూడాలి.