Begin typing your search above and press return to search.

కేఆర్కేని అరెస్ట్ చేసిన‌ ముంబై పోలీసులు

By:  Tupaki Desk   |   30 Aug 2022 6:18 AM GMT
కేఆర్కేని అరెస్ట్ చేసిన‌ ముంబై పోలీసులు
X
బాలీవుడ్‌ నటుడు.. నిర్మాత.. రచయిత కమల్‌ రషీద్‌ ఖాన్‌ను పోలీసులు మంగళవారం ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. బాలీవుడ్‌పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కేఆర్కే ట్వీట్లు తరచూ వివాదాస్పదమవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆయన తాజాగా అరెస్టయ్యారు. 2020లో ఆయన చేసిన వివాదాస్పద ట్వీట్‌పై మలాడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

దీంతో ప్రశ్నించేందుకు పోలీసులు ఆయన్ని ముంబై ఎయిర్‌ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. నేడు ఆయనను బొరివలీ కోర్టులో ప్రవేశపెడతారు. కమాల్‌ ఆర్‌ ఖాన్‌ పలు హిందీ సినిమాలతోపాటు భోజ్‌పురి సినిమాల్లోనూ నటించారు. పలు సినిమాలు నిర్మించారు. బిగ్‌బాస్‌-3లోనూ పాల్గొన్నారు.

క‌మ‌ల్ ఆర్ ఖాన్ ట్విట‌ర్ వేదిక‌గా చేసిన వ్యాఖ్య‌ల‌పై బాలీవుడ్ న‌టులు స‌ల్మాన్ ఖాన్..మ‌నోజ్ భాజ్ పాయ్ గ‌తంలో కేసులు వేసారు. స‌ల్మాన్ న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద స‌రిగ్గా ఆడ‌టం లేద‌ని.. వ‌సూళ్లు రావ‌డం లేద‌ని కెఆర్కే ట్వీట్స్ చేసారు. 'రాధే'..'మోస్ట్ వాంటెడ్ భాయ్' రిలీజ్ అయిన‌ప్పుడు కేఆర్కే ఈ ట్వీట్స్ చేసారు.

సినిమా బాలేద‌ని రివ్యూ ఇవ్వ‌డ‌మే కాకుండా క‌లెక్ష‌న్స్ లోనూ ప్లాప్ అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో అప్ప‌ట్లో స‌ల్మాన్ సీరియ‌స్ అయ్యారు. త‌న ప‌రువు..ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగేలా కమ‌ల్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని..త‌న ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాడ‌ని స‌ల్మాన్ త‌రుపు న్యాయ‌వాది కోర్టులో కేసు వేసారు. దీంతో అలాంటి వ్యాఖ్య‌లు చేయోద్దుని కోర్టు ఆదేశించింది.

అలాగే 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ని సాప్ట్ పోర్స్ సిరీస్ గా ట్రీట్ చేసారు. దీంతో పాటు మ‌నోజ్ భాజ్ పాయ్ భార్య‌..కుమార్తె గురించి అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఈ నేప‌థ్యంలో మ‌నోజ్ సైతం కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేసారు.

అలాగే పాన్ ఇండియా కేట‌గిరిలో రిలీజ్ అయిన తెలుగు సినిమా 'ఆర్ ఆర్ ఆర్' చిత్రానికి క‌మ‌ల్ నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'లైగ‌ర్' సినిమాపైనా క‌మ‌ల్ ఎటాకింగ్ త‌ప్ప‌లేదు. ఇలా క‌మ‌ల్ ర‌షీద్ ఖాన్ సెల‌బ్రిటీలు అంద‌ర్నీ టార్గెట్ చేసి అడ్డంగా బుక్క‌య్యారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.