Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లేడీ ఫైర్ బ్రాండ్ కు ముంబయి పోలీసుల నోటీసులు

By:  Tupaki Desk   |   21 July 2020 6:00 PM GMT
బాలీవుడ్ లేడీ ఫైర్ బ్రాండ్ కు ముంబయి పోలీసుల నోటీసులు
X
వెండితెరపై తమ అందచందాలతో కొత్త అందాల్ని తీసుకురావటమే కాదు.. ప్రేక్షకులకు గమ్మత్తు అనుభూతిని మిగిల్చే కథానాయకులు చాలామందే ఉంటారు. గ్లామర్ రసం ఒలకబోయటంతో పాటు.. కొన్నిసార్లు యాక్షన్ తో చెలరేగిపోతారు. రీల్ లో ఇన్ని షేడ్లు చూపించే భామలు.. రియల్ లైఫ్ లో మాత్రం ఒకే మూసలో కనిపిస్తారు. కానీ.. వీరికి భిన్నంగా ఉంటారు బాలీవుడ్ క్వీన్ కమ్ ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్. ఏదైనా విషయం మీద తానోసారి ఫిక్స్ అయితే.. దాని మీద ఎంతవరకైనా వెళ్లే మొండితనం ఆమె సొంతం.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై తొలి రోజు నుంచి సందేహాలు వ్యక్తం చేస్తూ సంచలన ప్రకటనలు చేసే కంగనాకు తాజాగా ముంబయి పోలీసులు నోటీసులు పంపారు. ఇప్పటివరకూ సోషల్ మీడియాలోనూ.. చిట్టి వీడియోల ద్వారా తన మనసులోని అభిప్రాయాల్ని చెప్పిన ఆమె త్వరలో ముంబయి పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. సుశాంత్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటన్న అంశంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు కంగానాను ప్రశ్నించాలని భావిస్తున్నారు.

ఇప్పటికే నలభై మంది వరకు సినీ ప్రముఖుల్ని విచారించిన ముంబయి పోలీసులు తాజాగా కంగనాకు నోటీసులు ఇచ్చారు. తాము సంధించే ప్రశ్నలకు ఆమె ఇచ్చే సమాధానాల్ని స్టేట్ మెంట్ రూపంలో రికార్డు చేయనున్నారు. సుశాంత్ కెరీర్ ను నాశనం చేయటానికి కొందరు బాలీవుడ్ ప్రముఖులు కంకణం కట్టుకున్నారని మొదట్నించి ఆరోపణలు చేస్తున్నారు కంగనా.

కేవలం ఆరోపణలతో ఆగిపోకుండా ఆమె కొందరు ప్రముఖుల పేర్లను ప్రస్తావించి సంచలనంగా మరారు. మహేష్ భట్.. కరణ్ జోహార్.. ఆదిత్య చోప్రా.. జావెద్ అఖ్తర్ లాంటి ప్రముఖులపై విమర్శలు గుప్పించారు. ముంబయి పోలీసులు అసలు కుట్రదారుల్ని విచారించకుండా మొక్కుబడిగా విచారణ చేస్తున్నారన్న ఘాటు విమర్శలు వారిని కూడా తాకినట్లుగా కనిపిస్తోంది. సుశాంత్ సూసైడ్ కు కారణం బాలీవుడ్ లోని సూసైడ్ గ్యాంగే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కొత్త కలకలంగా మారాయి.

సుశాంత్ ఆత్మహత్యపై చిట్టి వీడియోతో తన అభిప్రాయాల్ని కుండబద్ధలు కొట్టిన ఆమె.. ఒక హిందీ న్యూస్ చానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ నటించిన డ్రైవ్ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా నిర్మాతగా వ్యవహరించిన కరణ్ జోహార్ కుట్ర పన్నినట్లుగా ఆమె పేర్కొన్నారు.

అంతేకాదు.. సంజయ్ లీలా భన్సాలీ సినిమా తీయకుండా ఆదిత్య చోప్రా.. కరణ్ లు కుట్ర పన్నినట్లుగా పేర్కొన్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి కంగనా వద్ద ఉన్న ఆధారాల్ని చూపాలని ముంబయి పోలీసులు కోరనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఇప్పుడు కంగనా ఎక్కడ ఉన్నారన్నది చూస్తే.. లాక్ డౌన్ నేపథ్యంలో ఆమె.. తన సొంత పట్టణమైన మనాలీలో ఉన్నారు. తాను ముంబయి రావటానికి కుదరదని.. ముంబయి పోలీసులు మనాలికి వస్తే తన స్టేట్ మెంట్ ఇస్తానని స్పష్టం చేశారు. పోలీసులకు రావటం సాధ్యం కాకపోతే.. తాను ముంబయికి వచ్చినప్పుడు పోలీసుల విచారణకు హాజరవుతానని చెప్పారు. ఏమైనా.. ఇలాంటివి కంగనకు మాత్రమే సాధ్యమేమో?