Begin typing your search above and press return to search.

ఆ ఎఫైర్ గురించి సీనియర్ హీరో స్పందించాడు

By:  Tupaki Desk   |   12 May 2017 6:01 AM GMT
ఆ ఎఫైర్ గురించి సీనియర్ హీరో స్పందించాడు
X
సీనియర్ నటుడు మురళీ మోహన్ హీరోగా మంచి స్థాయిలో ఉన్నపుడు.. హీరోయిన్ జయచిత్రను పెళ్లి చేసుకోబోతున్నారంటూ అప్పట్లో పెద్ద ప్రచారమే నడిచింది. ఐతే అప్పటికే ఆయనకు పెళ్లి అయి ఉండటంతో ఈ ప్రచారం ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారి తీసింది. ఇంతకీ మురళీ మోహన్.. జయచిత్రను నిజంగానే ఇష్టపడ్డాడా? ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడా? అసలు వీళ్ల పెళ్లి గురించి ఎందుకంత ప్రచారం జరిగింది? కమెడియన్ ఆలీ నిర్వహించే ఓ కార్యక్రమంలో ఆయన ఈ ప్రశ్నలన్నింటికీ బదులిచ్చారు. ఆ రోజులకు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇంతకీ ఆయనేమన్నారంటే..

‘‘నేను సినీ పరిశ్రమలోకి వచ్చేసరికే నాకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అనుకోకుండా సినిమా అవకాశం వచ్చింది. అప్పటికి నా వయసు 33 సంవత్సరాలు. మా కుటుంబ వ్యాపారాలు వదిలేసి సినీ పరిశ్రమలోకి వస్తున్నా కాబట్టి ఇక్కడేదైనా రాంగ్ స్టెప్ వేస్తే ఇలా ఎందుకు చేశారు అని నా భార్యా పిల్లలు నన్ను అడిగే పరిస్థితి రాకూడదు అనుకున్నాను. అందుకే తాగుడు.. జూదం సహా ఏ చెడు అలవాట్లూ పెట్టుకోకూడదనుకున్నాను. నియమ నిబద్ధతతో ఉండాలనుకున్నాను. కానీ నాకు నా సహనటి జయచిత్రతో సంబంధం అంటగట్టేశారు. మేం అప్పట్లో వరుసగా సినిమాలు చేయడంతో ఇలా ప్రచారం జరిగింది.

ఓసారి షూటింగ్ కోసమని మద్రాసులో జయచిత్రతో కలిసి స్టూడియోలో వెళ్తుంటే.. నన్ను చూపించి అక్కడి వాళ్లు ఏదో మాట్లాడుకోవడం గమనించాను. తర్వాత నన్ను హీరోగా పరిచయం చేసిన అట్లూరి పూర్ణచంద్రరావు గారు మేకప్ రూంలోకి పిలిచి.. జయచిత్రను పెళ్లి చేసుకోబోతున్నావా అని అడిగారు. నేను షాక్ తిన్నాను. ఆయన ఓ తమిళ ఫిలిం మ్యాగజైన్లో వచ్చిన గాసిప్ చూపించారు. నేను జయచిత్రను పెళ్లి చేసుకోబోతున్నట్లు రాసేశారందులో. నేను నా పేరు మీద ‘మురళీ చిత్ర’ అనే బేనర్ పెడితే.. అందులో ‘చిత్ర’ అనేది జయచిత్రను ఉద్దేశించి పెట్టిందే అని రాశారు. నాకు అప్పటికే పెళ్లయి పిల్లలున్నారని.. జయచిత్రతో నాకు ఎలాంటి సంబధం లేదని.. ఆమెను ఏమండీ అని పిలుస్తానని పూర్ణచంద్రరావు గారికి చెప్పాను.

ఆ తర్వాత ఆ మ్యాగజైన్ కు లీగల్ నోటీసు పంపించాను. వాళ్లు సారీ చెప్పారు. కానీ ఆ తర్వాత నేను.. జయచిత్ర గారు.. దాసరి గారు.. వేరే వేరే సినిమాల కోసం మద్రాసు నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకుంటే.. అక్కడ ఎయిర్ పోర్టులో మమ్మల్ని చూసి ‘దాసరి ఆధ్వర్యంలో పెళ్లి చేసుకోబోతున్న మురళీ మోహన్-జయచిత్ర’ అని హెడ్డింగ్ పెట్టి ఎవరో వార్త రాశారు. ఆ తర్వాత ఇలాంటి వాటిని పట్టించుకోవడం మానేశాను’’ అని మురళీ మోహన్ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/