Begin typing your search above and press return to search.

'గ్యాంగ్ లీడర్' తరువాత 'గాడ్ ఫాదర్'కి కుదిరిన కాంబినేషన్!

By:  Tupaki Desk   |   4 Oct 2021 12:30 PM GMT
గ్యాంగ్ లీడర్ తరువాత గాడ్ ఫాదర్కి కుదిరిన కాంబినేషన్!
X
ఎవరు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగంలో శిఖరాలను అందుకోవాలంటే, అందుకు ఎంతో అంకితభావం కావాలి. కష్టాన్ని ఇష్టంగా భరించడం తెలియాలి. అప్పుడప్పుడూ ఓటమి పలకరిస్తున్నా, ఓర్చుకుంటూ ఓర్పుతో ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్న తీరాలకు .. ఆశించిన గమ్యానికి చేరుకోవడానికి వీలవుతుంది. అలా తనని తాను ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకుంటూ వెళ్లి, విజయాలను ఆదరించిన హీరోగా .. అధిరోహించిన హీరోగా చిరంజీవి కనిపిస్తారు. ఆయనతో పాటు తమ ప్రయాణాన్ని ప్రారంభించిన నటులు చాలామందే ఉన్నారు. వాళ్లంతా తమ బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నవారే.

అలాంటివారిలో మురళీ మోహన్ ఒకరుగా కనిపిస్తారు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా మురళీ మోహన్ కి మంచి పేరు ఉండేది. హీరోగా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన అనేక సినిమాలు చేశారు. ఒక వైపున రాజకీయాలు .. మరో వైపున బిజినెస్ లు చక్కబెడుతూ కూడా ఆయన నటించడం ఆపలేదు. ఇక తాజాగా ఆయన 'గాడ్ ఫాదర్' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల చిరంజీవి కాంబినేషన్లో 'ఊటీ'లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్లో మురళీమోహన్ కూడా పాల్గొనడం విశేషం.

చిరంజీవితో కలిసి గతంలో మురళీ మోహన్ 'మనఊరి పాండవులు' .. ' త్రినేత్రుడు' .. 'యుద్ధభూమి' .. ' గ్యాంగ్ లీడర్' మొదలైన సినిమాలలో నటించారు. 'గ్యాంగ్ లీడర్' సినిమా తరువాత మళ్లీ చిరంజీవితో కలిసి మురళీమోహన్ చేసిన సినిమా ఇదే. విజయబాపినీడు దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' సినిమా 1991లో వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగిన ఈ సినిమాలో, చిరంజీవికి అన్నయ్య పాత్రలో మురళీ మోహన్ నటించారు. ఈ సినిమాలో ఆయన పోషించిన 'రఘుపతి' పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది.

ఆ సినిమా తరువాత చిరంజీవితో కలిసి నటించే అవకాశం మురళీ మోహన్ కి మళ్లీ రాలేదు. ఇంతకాలానికీ, అంటే 'గ్యాంగ్ లీడర్' విడుదలైన 30 ఏళ్ల తరువాత 'గాడ్ ఫాదర్' సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది. ఈ ఇద్దరి మధ్య ఇంత గ్యాప్ రావడం నిజంగా ఆశ్చర్యమే. 'గాడ్ ఫాదర్'లోని ఆ పాత్రకి కూడా .. మురళీ మోహన్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని చిరంజీవి వ్యక్తం చేయడం వలన, ఆయననే తీసుకున్నారు. ఇక మురళీ మోహన్ 'జైసింహా' తరువాత మళ్లీ తెరపై కనిపించలేదు. మంచి పాత్ర వస్తేనే చేద్దాం .. లేదంటే లేదని ఆయన అనుకోవడం, ఆ తరువాత కరోనా రావడం వలన అనుకోకుండానే గ్యాప్ పెరిగిపోయింది. 'గాడ్ ఫాదర్'లో మురళీ మోహన్ పాత్ర ఎలా ఉంటుందో, చిరంజీవి అంతగా గుర్తుపెట్టుకుని ఆ పాత్రను ఆయనకే ఇవ్వడంలోని ప్రత్యేకత ఏమిటో చూడాలి.