Begin typing your search above and press return to search.

మురుగదాస్ లాజిక్ ఇదీ..

By:  Tupaki Desk   |   29 Oct 2018 5:30 PM GMT
మురుగదాస్ లాజిక్ ఇదీ..
X
తమిళంలో విజయ్ కొత్త సినిమా విడుదలవుతోందంటే ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. గత దశాబ్ద కాలంలో విజయ్ నటించిన ప్రతి సినిమా విషయంలోనూ ఏదో ఒక గొడవ తప్పలేదు. తాజాగా ‘సర్కార్’ విషయంలోనూ వివాదం నడుస్తోంది. వరుణ్ అనే రచయిత.. తాను 2007లో దక్షిణ భారత రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించిన కథను కాపీ కొట్టి మురుగదాస్ ‘సర్కార్’ సినిమా తీశాడంటూ ఆరోపించడం.. రెండు రెండు కథల్ని పరిశీలించిన సంఘం అధ్యక్షుడు భాగ్యరాజ్.. ‘సర్కార్’ కథలో వరుణ్ స్టోరీ తాలూకు ఛాయలు ఉన్నాయని నిర్ధారించడం కలకలం రేపుతోంది. మురుగదాస్ స్థాయి దర్శకుడు ఊరూ పేరూ లేని రచయిత దశాబ్దం కిందట రాసిన కథను కాపీ కొట్టి సినిమా తీయడమేంటి అన్న చర్చ నడుస్తోంది. ఐతే ఈ వ్యవహారంలో ఎక్కువమంది మురుగకే మద్దతుగా నిలుస్తున్నారు.

ఈ వివాదంపై సైలెంటుగా ఉండకుండా మురుగదాస్ ఓపెన్ అవుతున్నాడు. మీడియాతో మాట్లాడుతున్నాడు. తన వాదన వినిపిస్తున్నాడు. అలాగే తన వెర్షన్ వినిపిస్తూ సోషల్ మీడియాలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మురుగదాస్ చెబుతున్నదేంటంటే.. తాను ‘సర్కార్’ బౌండెడ్ స్క్రిప్టును రచయితల సంఘానికి సమర్పించలేదని.. కేవలం సినాప్సిస్ మాత్రం రాసి ఇచ్చానని.. యాదృచ్ఛికంగా అందులోని పాయింట్లు.. వరుణ్ కథలో కనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదన్నాడు. రెండు కథల్లో పోలికలు ఉన్నట్లు చెప్పిన భాగ్యరాజ్ కూడా ఒక రచయిత.. దర్శకుడని.. ఆయన తీసిన సినిమాలకు వేరే వాటితో పోలికలు లేవా అంటూ కొన్ని ఉదాహరణలు చెప్పాడు మురుగదాస్. ‘సర్కార్’ బౌండెడ్ స్క్రిప్టు తన ఆఫీస్ దాటి బయటికి పోలేదని.. దాన్ని చదవకుండానే ఈ కథ.. ఈ సినిమా కాపీ అని ఎలా అంటారని అతను ప్రశ్నించాడు. వరుణ్ అనే వ్యక్తిని జీవితంలో తానెప్పుడూ కలవలేదని.. అతనెవరో కూడా తనకు తెలియదని అన్నాడతను. తన సినిమాలో జయలలిత మరణం గురించి.. సమకాలీన రాజకీయాల గురించి ప్రస్తావన ఉందని.. మరి 2007 నాటి కథను కాపీ కొడితే ఇవన్నీ సినిమాలో ఎలా ఉంటాయని మురుగ ప్రశ్నించాడు. తాను విజయ్ తో సినిమాలు తీసినప్పుడే ఇలాంటి వివాదాలు వస్తున్నాయని.. దీని వెనుక ఉద్దేశమేంటో జనాలు అర్థం చేసుకోవాలని మురుగదాస్ కోరాడు.