Begin typing your search above and press return to search.

'ముత్తు' మార్నింగ్ షోలు క్యాన్సిల్.. కారణం ఏంటంటే..?

By:  Tupaki Desk   |   17 Sep 2022 11:01 AM GMT
ముత్తు మార్నింగ్ షోలు క్యాన్సిల్.. కారణం ఏంటంటే..?
X
కోలీవుడ్ హీరో శింబు నటించిన తాజా చిత్రం 'వెందు తనిందతు కాదు'. "ది లైఫ్ ఆఫ్ ముత్తు" అనే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌ స్టర్ డ్రామా.. సెప్టెంబర్ 15న తమిళ్ లో రిలీజ్ కాబడి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈరోజు (సెప్టెంబర్ 17) థియేటర్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

తమిళ్ లో హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో.. తెలుగులో చూసేందుకు ఆసక్తి కనబరిచిన ప్రేక్షకులు ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో శింబు చిత్రానికి అడ్డంకులు ఎదురయ్యాయి. అనుకోకుండా ఈరోజు మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' అన్ని మార్నింగ్ షోలు రద్దు చేయబడ్డాయి. మొదటి ఆటకు టికెట్లు బుక్ చేసుకున్న వారందరికీ షో క్యాన్సిల్ అయిందని మెసేజ్ రావడంతో షాక్ అయ్యారు. రిలీజ్ డే నాడే షోలు రద్దు అవ్వడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే సెన్సార్ ఇబ్బందుల కారణంగానే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

తెలుగు డ్డబ్బింగ్ వెర్షన్ సెన్సార్ ఆలస్యమవడంతో మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయని తెలుస్తుంది. అయితే కేవలం మార్నింగ్ షోలు మాత్రమే రద్దు చేయబడ్డాయని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 గంటల షోతో రిలీజ్ అవుతుందని స్రవంతి మూవీస్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది. అయినప్పటికీ కొన్ని ఏరియాల్లో మ్యాట్నీ షోలు పడలేదని నెటిజన్ల ట్వీట్స్ చూస్తే అర్థమవుతుంది.

శిలంబరసన్ టిఆర్ అకా శింబు తెలుగు ప్రేక్షకులకు చాలా కాలంగా సుపరిచితుడే. కాకపోతే తెలుగులో కనిపించి చాలా ఏళ్ళయింది. అతని చివరి చిత్రం 'మానాడు' కూడా చివరి నిమిషంలో విడుదల ఆగిపోయింది. అయితే సోనీ లివ్ ఓటీటీలో ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు 'ముత్తు' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు.

కాగా, 'లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమాలో సిద్ధి ఇద్నాని హీరోయిన్ గా నటించగా.. రాధికా శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించింది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శింబు - గౌతమ్ మీనన్ - రెహమాన్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. మరి ఈ డబ్బింగ్ చిత్రం తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.