Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: ఈ మార్తాండం అఖండుడే!

By:  Tupaki Desk   |   21 July 2018 2:12 PM GMT
టీజర్ టాక్: ఈ మార్తాండం అఖండుడే!
X
ఎన్నో భాషల్లో ఎన్నో వందల సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి కానీ తెలుగులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కామెడీ. తెలుగులో ఉన్నంత పీక్ లెవెల్ కామెడీ ఎక్కడ కూడా భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అలానే మన భాషలో ఉన్నంతమంది కమెడియన్స్ వేరే ఏ భాషలో కూడా కనపడరు... అంతెందుకు హిందీలో మీకు తెలిసిన ఓ నలుగురు కమెడియన్ల పేర్లు చెప్పమంటే భారీగా బాలీవుడ్ సినిమాలు చూసే అభిమాని కూడా బిక్కమొహం వెయ్యాల్సిందే. అంతే కాదు కమెడియన్లందరూ హీరో అవతారమెత్తడం కూడా తెలుగులో చాలా సాధారణమే.. అదే ట్రెండులో కామెడీని పండించడానికి 'మై డియర్ మార్తాండం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు 30 ఇయర్స్ పృథ్వి గా సుపరిచితుడయిన పృథ్విరాజ్.

'మై డియర్ మార్తాండం' సినిమా టీజర్ ను వైకాపా అధ్యక్షుడు YS జగన్మోహన్ రెడ్డి ఈమధ్యనే ఆవిష్కరించారు. టీజర్ ను చూస్తుంటే ఈ సినిమా మిగతా కమెడియన్ టర్న్డ్ హీరోలలా మాస్ హీరోగా తన విన్యాసాలను ప్రదర్శించడానికి కాకుండా హాస్యం పై దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తోంది. టీజర్ ఓపెన్ చేయ్యగానే పృథ్వి తనకు మాత్రమే సాధ్యమైన స్టైల్ లో 'పెళ్లి చేసుకోకుండా సన్యాసినయ్యాను.. ఈ కేసు వాదించి సన్నాసినయ్యాను" అనే పంచ్ ని విసురుతాడు. ఈ ఒక్క పంచ్ చాలు.. సినిమా ఎలా ఉండబోతోందో చెప్పడానికి. ఇదొక్కటే కాదు. లాయర్ అవతారంలో క్లయింట్లను.. తోటి లాయర్లను.. చివరకి జడ్జిని కూడా వదలకుండా ముప్పతిప్పలు పెడుతున్నట్టుగా 'మార్తాండం' పాత్రను చూపించారు.

చివరి పంచ్ గా '30 రోజులలో లాయర్ కావడం ఎలా' అనే పుస్తకాన్ని శ్రద్ధగా చదువుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టాడు. చూస్తుంటే కొత్త దర్శకుడు హరీష్ రైట్ ట్రాక్ లో పృథ్వి కామెడీ టైమింగ్ ని ఫుల్లుగా వాడుకున్నట్టుగా అనిపిస్తోంది.. మీరూ టీజర్ పై ఓ లుక్కేయండి.