Begin typing your search above and press return to search.

ఇన్నేళ్ల నా సంపాదన ఆ ఒక్క సినిమాతో పోయింది!

By:  Tupaki Desk   |   5 Feb 2022 2:30 AM GMT
ఇన్నేళ్ల నా సంపాదన ఆ ఒక్క సినిమాతో పోయింది!
X
జె.కె. భారవి పేరు వినగానే 'శ్రీరామదాసు' .. 'అన్నమయ్య' .. 'శ్రీ మంజునాథ' వంటి సినిమాలు కళ్లముందు కదలాడతాయి. ఆ సినిమాలకు కథారూపాన్ని ఇచ్చింది ఆయనే. తెలుగులో ఆయన దర్శకుడు కె రాఘవేంద్రరావుతో ఎక్కువ ప్రయాణం చేశారు. ఆయన సినిమాలకి ఎక్కువగా పనిచేశారు. రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.

తెలుగులోనే కాదు కన్నడలో కూడా ఆయన అనేక సినిమాలకు రచయితగా పనిచేసి, అక్కడ కూడా గౌరవ మర్యాదలను అందుకున్నారు. అలాంటి భారవి తాజా ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను చెప్పుకొచ్చారు.

తాను ఇంటర్వ్యూకి ఓలా బైక్ పై రావలసి వచ్చిన పరిస్థితిని గురించి భారవి ప్రస్తావించారు. "భారవి చూసినన్ని కార్లు ఇండస్ట్రీలో మరో రైటర్ చూసుండరు. అన్ని కార్లను చూశాను .. అంత వైభవాన్ని చూశాను. నారా జయశ్రీదేవిగారు నన్ను ఓ దత్త పుత్రుడిలా చూసుకున్నారు. కన్నడలో అనేక హిట్లను ఇచ్చాను .. ఆ రికార్డులను ఎవరూ అధిగమించలేరు. తెలుగు .. కన్నడ భాషల్లో కథలు ఓకే అయ్యాయి. కానీ కరోనా కారణంగా ఫండ్స్ ఇంకా రిలీజ్ చేయడం లేదు. ఇక ఇప్పుడు నా ఆర్ధిక పరిస్థితి విషయానికి వస్తే, చెరువులో నీళ్లు చెరువులోనే పోసినట్టయింది.

అట్లా సినిమాల్లో సంపాదించిన డబ్బంతా సినిమాలోనే పోయింది. ఒక 'జగద్గురు ఆదిశంకర' తీయకపోయి ఉంటే, ఈ ప్రశ్న మీరు అడిగే అవకాశం ఉండేది కాదు. ఇన్ని సంవత్సరాల్లో నేను సంపాదించిందంతా ఒక్క 'జగద్గురు ఆదిశంకర'తో పోయింది. ఆయన భిక్షా పాత్రా పట్టుకుని ఎలా తిరిగాడో .. అలాంటి పరిస్థితి నాకు కలిగించారు .. అందుకు ఆయనకి ధన్యవాదాలు. అహంభావానికి పోకుండా లైఫ్ ను కొత్తగా స్టార్ట్ చేయమని ఆయన అలా చేశారు. అందువల్లనే ఈ రోజున నేను ఇక్కడికి ఓలా బైక్ పై రావలసి వచ్చింది.

రాఘవేంద్రరావు గారికి నేను అంటే ఎంతో ప్రేమ .. ఎంతో అభిమానం. నన్ను ఎప్పుడూ కూడా ఆయన 'కవిగారూ' అనే పిలుస్తుంటారు. నాకు ఏసీ పడదని తెలిసి కారు ఎక్కినా .. ఇంటికి వెళ్లినా .. ఆఫీసుకు వెళ్లినా వెంటనే ఏసీ కట్టేస్తుంటారు. నాకు ఆయన ఇచ్చిన గౌరవం అసాధారణం .. అనన్య సామాన్యం. ఏ రచయిత కూడా అలాంటి గౌరవాన్ని చూసి ఉండడు. రాఘవేంద్రరావుగారు అయినా .. నాగార్జున గారైనా 'సార్ .. నా పరిస్థితి కొంచెం కష్టంగా ఉంది' అంటే డెఫినెట్ గా సాయం చేస్తారు. 'ఒకరి దగ్గర చేయి చాచడం కంటే మరణం మేలు' అని రాముడు అన్నాడు. అలా భారవి మరణించడు" అని చెప్పుకొచ్చారు.