Begin typing your search above and press return to search.

‘కబాలి’లో మా నాయన బాలయ్య..

By:  Tupaki Desk   |   21 July 2016 12:13 PM GMT
‘కబాలి’లో మా నాయన బాలయ్య..
X
‘కబాలి’లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ తెలుగు పుస్తకం ఇంగ్లిష్ వెర్షన్ చదువుతూ కనిపిస్తాడన్న విషయం ఆసక్తి రేపుతోంది. కరీంనగర్ కు చెందిన వైబీ సత్యనారాయణ అనే రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాసిన పుస్తకం ‘మా నాయిన బాలయ్య’. ఇది సమాజంలోని అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థితికి చేరిన తెలంగాణ దళిత మాదిగ కుటుంబం చేసిన పోరాటాన్ని నేపథ్యంలో సాగే కథ. దళిత సాహిత్యంలో చాలా గొప్ప పుస్తకంగా ఇది పేరు తెచ్చుకుంది.

తన కుటుంబ చరిత్రని ఆయన ఇందులో చెప్పుకుంటూ వచ్చాడు. ముత్తాత నర్సయ్య దగ్గర్నుంచి మొదలుపెట్టి తన తండ్రి యెలుకటి బాలయ్యతో పాటు మొత్తం నాలుగు తరాల చరిత్రను చెప్పారిందులో. దీన్ని ఇంగ్లిష్ లోకి ‘మై ఫాదర్ బాలయ్య’ పేరుతో అనువాదం చేశారు. ‘కబాలి సినిమాలో రజినీకాంత్ ఓ సన్నివేశంలో ఈ పుస్తకాన్ని చదువుతూ కనిపిస్తాడు. ‘కబాలి’కి సంబంధించిన విజువల్స్ లో ఇది కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటో కూడా ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

రజినీకాంత్ ఈ పుస్తకాన్ని చదువుతూ కనిపించడంలో దర్శకుడు పా.రంజిత్ పాత్ర కీలకం. ఓ దర్శకుడి కులం గురించి మాట్లాడ్డం సరి కాదు కానీ.. ఇక్కడ ఆ విషయం ప్రస్తావించాల్సిందే. రంజిత్ ఓ పేద దళిత కుటుంబం నుంచి వచ్చాడు. అనేక కష్టాలకు ఓర్చి పైకెదిగాడు. రంజిత్ తొలి రెండు సినిమాల్లోనూ అంతర్లీనంగా దళిత కుటుంబాల.. వారి సమస్యల ప్రస్తావన ఉంటుంది. దళిత సాహిత్యం మీద రంజిత్ కు ఎంతో పట్టుంది. కమ్యూనిజం మీద.. అంబేద్కరిజం మీద అతడికి మంచి అవగాహన ఉంది. ‘కబాలి’ షూటింగ్ సందర్భంగానూ తాను చదివిన గొప్ప పుస్తకాల్ని రజినీకి పరిచయం చేసినట్లు చెప్పాడు రంజిత్. ‘మా నాయన బాలయ్య’ పుస్తకం గొప్పదనం తెలుసుకునే రంజిత్.. సినిమాలో రజినీ ఆ బుక్ చదువున్నట్లు చూపించాడన్నమాట.