Begin typing your search above and press return to search.

మహేష్‌ - రవితేజల మూవీస్‌.. ఫుల్‌ క్లారిటీ

By:  Tupaki Desk   |   31 Oct 2018 4:59 AM GMT
మహేష్‌ - రవితేజల మూవీస్‌.. ఫుల్‌ క్లారిటీ
X
ఈమద్య కాలంలో మైత్రి మూవీ మేకర్స్‌ వరుసగా సినిమాలను నిర్మిస్తూ దూసుకు పోతున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్‌ లో తెరకెక్కిన ‘సవ్యసాచి’ మరియు ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రాలు విడుదలకు సిద్దం అయ్యాయి. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన మైత్రి మూవీస్‌ నిర్మాతలు పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశారు. తమ భవిష్యత్తు మూవీలను కూడా ప్రకటించారు. 89 లక్షలతో సినిమాను నిర్మించబోతున్నట్లుగా ప్రకటించిన మైత్రి వారు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న మహేష్‌ - రవితేజల మూవీలపై క్లారిటీ ఇచ్చారు.

మహేష్‌ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’లో నటిస్తున్నాడు. వచ్చే సమ్మర్‌ లో ఆ సినిమా రాబోతుంది. ఆ సినిమా విడుదల కాకుండానే సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్‌ బాబు ఒక సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఒక పీరియాడిక్‌ కథతో ఒక చిత్రాన్ని చేయాలని భావించారు. అయితే మహేష్‌ బాబు ఆ కథను కాదని కొత్త కథతో సినిమా చేద్దామంటూ సుకుమార్‌ కు సూచించాడట. కథ రెడీ అవుతోంది అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా మహేష్‌ - సుకుమార్‌ ల మూవీని నిర్మించబోతున్న మైత్రి వారు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇంకా కథ రెడీ కాని మాట వాస్తవమే - వారిద్దరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు మేము సినిమా నిర్మించేందుకు రెడీ అవుతామని పేర్కొన్నారు.

ఇక రవితేజతో ‘తేరీ’ మూవీ రీమేక్‌ గురించి మైత్రి నిర్మాతలు స్పందిస్తూ త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌ కూడా తెరకెక్కబోతున్నట్లుగా ప్రకటించారు. పవన్‌ కళ్యాణ్‌ తో మొదట ‘తేరీ’ రీమేక్‌ ను సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేయాలనుకున్నాం. కథను కూడా మార్పులు చేర్పులు చేసి సిద్దం చేయించాం. కాని పవన్‌ గారు సినిమా చేయనని చెప్పారు. దాంతో ఆయన అనుమతి తీసుకుని అదే రీమేక్‌ ను రవితేజతో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రవితేజ బాడీ లాంగ్వేజ్‌ కు తగ్గట్లుగా కథలో మార్పులు చేర్పు చేస్తున్నట్లుగా మైత్రి వారు ప్రకటించారు. ఈ రెండు సినిమాలు కూడా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాలే కాకుండా సుకుమార్‌ తో కలిసి మెగా చిన్న మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఒక చిత్రాన్ని మైత్రి వారు నిర్మించనున్నారు. పలు చిన్న పెద్ద ప్రాజెక్ట్‌ లను వీరు మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.